close

తాజా వార్తలు

Published : 04/12/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ క్రిమిసంహారకాలతో గాలి కలుషితమే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇళ్లు, కార్యాలయాల్లో ఉపరితలాలను శుభ్రపరిచే క్రిమిసంహారకాలతో గాలి కాలుష్యం, అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఆధారిత క్రిమిసంహారకాలతో గది వాతావరణం కాలుషితం అవడంతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో రసాయన క్రిమిసంహారక ఉత్పత్తుల వాడకం పెరిగిన నేపథ్యంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సస్కాచెవాన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. తాజాగా ఈ పరిశోధనా పత్రం ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా శుభ్రతకు ప్రాముఖ్యత పెరగడం, శానిటైజర్లతో పాటే ఫ్లోర్‌ క్లీనర్‌ల ఉత్పత్తుల వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ డిస్‌ఇన్ఫెక్షన్‌ల వాడకం మరింత ఎక్కువైంది. ఇలా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఆధారిత క్రిమిసంహారకాలతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉపరితలాలను శుభ్రం చేసిన సమయంలో అక్కడ ఈ రసాయనాల స్థాయి 600 పీపీబీ(పార్ట్స్‌ పర్‌ బిలియన్‌)కి పెరిగినట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది సాధారణంగా 8 గంటల కాలపరిమితితో గరిష్ఠంగా ఉండాల్సిన దానికంటే దాదాపు 60శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. క్రిమిసంహారకాలతో ఉపరితలాలను కడిగిన అరగంట తర్వాత ఆ గదిలో గాలి నాణ్యతను పరీక్షించారు. తద్వారా క్రమిసంహారకాల ప్రభావాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా గదులు శుభ్రపరిచే వ్యక్తులకు వీటి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. అయితే, కరోనా వైరస్‌ కట్టడికి కెనడా ప్రభుత్వం అనుమతించిన ఈ క్రిమిసంహారక ఉత్పత్తులో దాదాపు పదిశాతం వైరస్‌ కట్టడిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

క్రిమిసంహారకాలతో ఫ్లోర్‌లను కడిగినప్పుడు ఆప్రాంతం లేదా గది వాతావరణంపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన రసాయనశాస్త్రవేత్త తారా కహాన్‌ స్పష్టంచేశారు. కరోనా విజృంభణ తొలినాళ్లలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉత్పత్తులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల వీటిపై పరిశోధన చేయలేకపోయినట్లు తెలిపారు. అయితే, ఇలాంటి రసాయనాలకు భౌతికంగా దగ్గరగా ఉండే చిన్నారులు, పెంపుడు జంతువులపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయం తెలియదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాణ్యమైన గాలి లేని ఇండోర్‌ ప్రాంతాలు ఆస్తమా వంటి సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు. అత్యధిక మొత్తంలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌కు గురికావడం వల్ల శ్వాసకోససంబంధ వ్యాధులతో పాటు చర్మ, కంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని ఇదివరకే అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రాలు(సీడీసీ) ప్రకటించింది.

అయితే, వీటి వల్ల ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో.. వీటినుంచి బయటపడేందుకు ఇళ్లలో క్రిమిసంహారకాలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా క్రిమిసంహారకాలకు బదులు నీరు, సబ్బును వాడాలని సూచిస్తున్నారు. వీటికి కరోనాకు కారణమైన వైరస్‌ను నశింపజేసే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. వీటితోపాటు గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని