
తాజా వార్తలు
ఆ నిర్ణయం చైనా మీద ‘డిజిటల్ దాడి’ వంటిదే
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
దిల్లీ: చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ దాడి’గా అభివర్ణించారు. భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్..చైనాకు చెక్ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. దానిలో భాగంగానే యాప్‌లపై నిషేధం విధిస్తూ ప్రకటన చేసింది.
ఈ నిర్ణయంపై కేంద్ర టెలికాం, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘దేశ ప్రజల సమాచారాన్ని రక్షించేందుకు చైనా యాప్‌లను నిషేధించాం. ఇది డిజిటల్ దాడి. భారత్ శాంతికి కట్టుబడి ఉంది. కానీ, ఎవరైనా అనైతిక చర్యకు పాల్పడితే తగిన సమాధానం చెప్తుంది. మన వైపు 20 మంది సైనికులు మరణిస్తే..చైనా వైపు ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి కరోనా వైరస్ కాగా, రెండోది చైనా’ అని వ్యాఖ్యానించారు. అలాగే టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన పలు యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఎయిర్ స్ట్రైక్స్‌గా వర్ణిస్తున్నాయి. గత సంవత్సరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాన్ని భారత సైన్యం బాంబులతో నేలమట్టం చేసిన ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించాయి.
ఇదిలా ఉండగా..టిక్‌టాక్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ భారత్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంది. అలాగే మనదేశానికి చెందిన వారిని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ నిర్ణయం ఆ సంస్థ పై తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ వీబో నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
చైనీస్ వీబోకు ప్రధాని మోదీ బై..బై
హువావే, జెడ్‌టీఈతో జాతీయ భద్రతకు ముప్పు!