close

తాజా వార్తలు

చారిత్రక తప్పిదాన్ని సవరిస్తున్నాం: అమిత్‌ షా

శివసేన వైఖరి దిగ్భ్రాంతి కల్గించింది

పాక్‌ ప్రధాని, కాంగ్రెస్‌ అభిప్రాయాలు ఒకేలా ఉంటున్నాయ్‌
పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. కాసేపట్లో ఓటింగ్‌ 

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఎగువ సభలో బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధమే జరిగింది. ప్రతిపక్షాలు ఈ బిల్లు చట్టవిరుద్ధమైనదంటూ విమర్శలు చేశాయి. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారంటూ ఆక్షేపించాయి. ప్రతిపక్షాల విమర్శలకు అమిత్ షా దీటుగా సమాధానం చెప్పారు. ఈ బిల్లు ఇతర సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాదనీ.. గతం ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వాలు ఉన్నది సమస్యలు పరిష్కరించేందుకేనన్నారు. ఈ బిల్లు పౌరసత్వాన్ని కల్పించేదే తప్ప దాన్ని హరించేది కాదని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయాలు ఒకేలా ఉంటున్నాయని అమిత్‌ షా దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై ఇరువురూ ఒకేరకమైన అభిప్రాయాలను వ్యక్తంచేశారని మండిపడ్డారు.  తమకు రాజకీయ ఎజెండా ఉందని విమర్శించేందుకు ఇప్పుడు ఎక్కడా ఎన్నికలు కూడా లేవన్నారు. ఈ బిల్లును  50 ఏళ్ల క్రితమే తీసుకొచ్చి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కరించడంలో విఫలమైనందువల్లే ఇప్పుడు బిల్లు తేవడం అవసరమైందని చెప్పారు. పాకిస్థాన్‌లో సిక్కు, హిందూ మహిళలు హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఫ్గనిస్థాన్‌లో మైనార్టీలపై దశాబ్దాలుగా హింస జరుగుతోందన్నారు.  1992కు ముందు ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 2లక్షల మందికి పైగా హిందువులు, సిక్కులు ఉండేవారనీ.. ఇప్పుడు తగ్గిపోయారన్నారు. 2018లో యూఎన్‌ నివేదిక ప్రకారం ఆఫ్గనిస్థాన్‌లో కేవలం 500 మంది మాత్రమే ఉన్నారని హోంమంత్రి వెల్లడించారు.  

ఈ బిల్లు ఎవరినీ కించపరచేది కాదు
భారతదేశం నిరంతరం మైనార్టీలను సంరక్షిస్తూనే ఉందన్న అమిత్‌ షా.. పాకిస్థాన్‌ మాత్రం అలా కాదన్నారు.  శరణార్థులు తమ పరిస్థితిని నిర్భయంగా తెలిపేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. పౌరసత్వ బిల్లుకు ఇదే తొలి సవరణ కాదనీ.. గతంలో శ్రీలంక, ఉగాండా నుంచి కూడా శరణార్థులు భారత్‌కు వచ్చేందుకు గతంలో సవరణలు జరిగాయన్నారు. భారతీయు ముస్లింలను ఈ బిల్లు కించపరబోదని స్పష్టంచేశారు. వారి పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ‘‘మత హింసకు గురైన ముస్లింలకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు ఇప్పటికే ఉన్న చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లింలు మైనార్టీలు కాదు. ఇస్లాంను అనుసరించే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌ల ముస్లింలను మైనార్టీలని పిలుస్తారా? లేదు. ’’ అన్నారు. 

చారిత్రక తప్పిదాన్ని సవరిస్తున్నాం
‘‘చారిత్రక తప్పిదాన్ని మేం సరిచేస్తున్నాం. మైనార్టీలకు భారత్‌ అండగా నిలబడింది. రోహింగ్యాలు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్నారు. పొరుగు దేశాల్లోని మైనార్టీలకు ఆ దేశాలు అండగా నిలబడలేదు. అధికారం కోసం కొందరు ఎన్ని రంగులైనా మారుస్తారు. మేం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకోం. ఆర్టికల్‌ 14ను ఈ బిల్లు ఉల్లంఘించడంలేదు. మేం చారిత్రక తప్పిదాన్ని సవరిస్తున్నాం. ప్రతిపక్షాలు వాస్తవాలను విస్మరిస్తున్నాయి. 

రాత్రికి రాత్రే శివసేన వైఖరి మారిపోయింది
‘‘పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన రాత్రికి రాత్రి తన వైఖరిని మార్చేసింది. అధికారాన్నే పరమావధిగా భావించి తన నిర్ణయాన్ని ఇలా అకస్మాత్తుగా మార్చుకోవడం దిగ్భ్రాంతి కల్గించింది. ఈ బిల్లుకు ఎవరైనా ఓటు వేస్తే వారు దేశ వ్యతిరేకులు అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా. గతంలో శ్రీలంక నుంచి వచ్చిన 8 నుంచి 9 లక్షల మంది తమిళులకు భారతీయ పౌరసత్వం కల్పించారు. ఈ బిల్లులో పౌరసత్వాన్ని హరించే నిబంధన ఏదీ లేదు. ఇది పౌరసత్వాన్ని కల్పించే బిల్లు’’ అని  అమిత్‌ షా వివరించారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.