
తాజా వార్తలు
కొవిడ్ రోగులను అలా చూడకండి..
కరోనా బాధితుల ఇళ్లకు పోస్టర్లు అంటించడంపై సుప్రీం వ్యాఖ్య
దిల్లీ: కరోనావైరస్ సోకిన వ్యక్తుల ఇళ్లకు పోస్టర్లు అంటించడం వల్ల వారిని అంటరానివారిగా పరిగణిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది భిన్నమైన అభిప్రాయాలను వెల్లడిస్తోందని అభిప్రాయపడింది. కాగా, దీనిపై స్పందించిన కేంద్రం.. తాము ఈ నిబంధనను సూచించనప్పటికీ, దీని లక్ష్యం ఇతరులను రక్షించడమేనని వెల్లడించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..కొన్ని రాష్ట్రాలు స్వతహాగా ఈ నిబంధనను అమలుచేస్తున్నాయని తెలిపారు. పోస్టర్లు అంటించే విధానానికి స్వస్తి పలికేలా దేశవ్యాప్తంగా నిబంధనలు జారీ చేయాలని నవంబర్ ఐదున సుప్రీం ఆదేశాలివ్వగా ..దానిపై త్వరలోనే కేంద్రం సమాధానమిస్తుందన్నారు. దాంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, నవంబర్ 3న కొవిడ్-19 పాజిటివ్, హోం ఐసోలేషన్ కుటుంబాల ఇళ్ల బయట ఇకనుంచి పోస్టర్లు అంటించమని, ఇప్పటికే అంటించిన వాటిని తొలగించేలా అధికారులను ఆదేశించామని ఆప్ ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. అలాగే కరోనా పాజిటివ్ వ్యక్తుల వివరాలను తమ పొరుగువారితో, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వాట్సాప్ గ్రూపులలో వెల్లడించవద్దని సూచించామని తెలిపింది.