3 నుంచి 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

తాజా వార్తలు

Updated : 29/07/2020 21:24 IST

3 నుంచి 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

మానవ వనరుల శాఖ పేరు విద్యా మంత్రిత్వశాఖగా మార్పు
నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

దిల్లీ: జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు. గత 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు లేవని, ప్రస్తుతం నూతన విద్యా విధానం అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్‌ అన్నారు.

వృత్తి, ఉపాధి లభించేందుకు ఈ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఉన్నత విద్యలో 2035 నాటికి 50 శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నత విద్య కార్యదర్శి అమిత్ ఖరే తెలిపారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పాటు, విద్యార్ధులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాలనేది నూతన విద్యా విధానం ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు. అలానే విద్యాహక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గతంలో ఉన్న 10+2 స్థానంలో నూతన విద్యా విధానంలోని 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ఐదేళ్ల ఫౌండేషన్ కోర్సులో మొదటి మూడు సంవత్సరాలు 3 నుంచి 6 ఏళ్ల వయస్సు వారికి, తర్వాతి రెండేళ్లు 6 నుంచి 8 ఏళ్ల వయసు వారికి ఒకటి, రెండు తరగతుల విద్య అందిచనున్నారు. తర్వాత 8 నుంచి 11 ఏళ్ల వయసు వారికి 3 నుంచి 5 తరగతులు, 11 నుంచి 14 ఏళ్ల వయసు వారికి 6 నుంచి 8 తరగతులు, 14 నుంచి 18 ఏళ్ల వయసు వారికి 9 నుంచి 12 తరగతులు నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు. ఇక మీదట బోర్డు పరీక్షలు ప్రాధాన్యం తగ్గిస్తూ, నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిపోర్టు కార్డులు మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్ధ్యాల నివేదికగా ఉండాలని అన్నారు. దానితో పాటు ఆర్ట్స్, సైన్స్‌ మధ్య ఎలాంటి విభజన ఉండదని తెలిపారు.   

దేశంలో మొత్తం 45,000 అనబంధ కళాశాలలు ఉండగా, వాటికి గ్రేడెడ్ అటానమీ కింద అండర్ గ్రాడ్యుయేట్‌, అకడమిక్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ఫైనాన్షియల్ అటానమీ కేటగిరీల కింద అక్రిడియేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక భాషల్లో ఈ-కోర్సులను రూపొందించనున్నట్లు తెలిపారు. నేషనల్‌ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ (ఎన్‌ఈటీఎఫ్) ఏర్పాటు చేసి వర్చువల్ ల్యాబ్స్‌ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత విద్యా విధానంలో డీమ్డ్‌ యానివర్శిటీలకు, సెంట్రల్ యూనివర్శిటీలకు, స్వతంత్ర సంస్థలక వేర్వేరు విధివిదానాలు ఉండగా, వాటి స్థానంలో అన్నింటికి ఒకేరకమైన విధివిధానాలు అమలుచేయనున్నట్లు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని