close

తాజా వార్తలు

Published : 01/04/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వలస కార్మికులపై కేంద్రానికి సుప్రీం సూచనలు

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వలసలు వెళ్తున్న కార్మికులను ప్రభుత్వం మార్గమధ్యంలోనే ఆపి శిబిరాలకు తరలిసున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి శిబిరాల్లో భోజన, వైద్య సదుపాయాలతో పాటు అన్ని మతాలకు చెందిన నాయకులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ‘‘ వైరస్‌ కంటే ఆందోళన ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది. భవిష్యత్తుపై ఆందోళనతో వలస వెళుతున్న కార్మికులను సహాయ శిబిరాలకు తరలించడంతో పాటు వారిలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు అవసరమైతే ప్రత్యేకంగా కౌన్సిలర్లను నియమించి వారితో భజనలు, కీర్తనలు, నమాజ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మానసిక ధైర్యాన్ని నింపాలి’’ అని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు 24 గంటల్లో కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్‌ మోహతా కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 21 వేల 64 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి మొత్తం 6 లక్షల 66 వేల 291 మందికి వసతి కల్పించినట్లు కేంద్ర హోంశాఖ కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దాదాపు 23 లక్షల మంది వలస కూలీలకు ఆహారం అందించి వారి సమస్యలు పరిష్కరించినట్లు హోంశాఖ తెలిపింది. 

మంగళవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరావులతో కూడిన ధర్మాసనం వలస కార్మికుల సమస్యల నియత్రణం కోసం దాఖలైన పిటిషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. కేంద్రం తరపున సొలిసెటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ప్రస్తుతం వలస కార్మికులెవరూ రోడ్లపై లేరని, ఒక వేళ  ఎవరైనా రోడ్లపై ఇబ్బందులు పడుతుంటే వారిని దగ్గర్లోని శిబిరాలకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా 24 గంటల్లో వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిపుణుల కమిటినీ ఏర్పాటు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. అంతే కాకుండా కరోనాపై తప్పుడు వార్తల నియంత్రణకోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని