
తాజా వార్తలు
దోషులను ఉరితీసేందుకు 7రోజులే గడువివ్వండి
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్రం
దిల్లీ: మరణశిక్ష విధించిన దోషులకు ఉన్న న్యాయపరమైన హక్కులను సవరించాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన తర్వాత 14 రోజులు కాకుండా వాళ్లను ఏడు రోజుల్లోనే ఉరి తీసేందుకు అనుమతివ్వాలని కేంద్రం తన పిటిషన్ ద్వారా కోరింది. దోషులకు క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకునేందుకు ఎక్కువ సమయం ఉండటంతో వాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చట్టంతో ఆడుకుంటున్నారని కేంద్రం ఆరోపించింది. వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాల కారణంగా శిక్ష ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. నిర్భయ నిందితుల ఉరి ప్రక్రియ ఆలస్యం చేయడాన్ని ఈ సందర్భంగా కేంద్రం తన పిటిషన్లో ప్రస్తావించింది.
ఉరిశిక్ష పడిన దోషులకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకునేందుకు నిర్ణీత సమయాన్ని కేటాయించాలని కేంద్రం కోరింది. ఈ సందర్భంగా 2014లో శతృఘ్న చౌహాన్ కేసు దోషులను ఉరి తీసిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. ఈ కేసు దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోగా అది తిరస్కరణకు గురైంది. పిటిషన్ తిరస్కరణకు గురైన 14 రోజుల తర్వాతే దోషులను ఉరి తీయాలి కానీ ఈ కేసులో అలా జరగలేదు.
నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ దిల్లీ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు దోషులు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లను వేశారు. వాటిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మళ్లీ దోషి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. దాన్ని కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇలా వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవడం వల్ల కోర్టు ఇచ్చిన డెత్‌వారెంట్ గడువులోపు వాళ్లను ఉరితీయడం కుదరదని తీహాడ్ జైలు అధికారులకు కోర్టుకు తెలియజేశారు. దీంతో దిల్లీ కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించింది.