
తాజా వార్తలు
కేంద్రంతో రైతుల చర్చలు ప్రారంభం
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న అన్నదాతలతో ఎట్టకేలకు కేంద్రం చర్చలు ప్రారంభించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం మధ్యాహ్నం 35 రైతు సంఘాల నాయకులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, దిల్లీ రైతులతో సాయంత్రం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు వ్యవసాయ మంత్రి తోమర్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా హస్తిన సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు బైఠాయించారు. రైతుల నిరసన రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో కేంద్రం దిగొచ్చింది. మంగళవారం చర్చలకు రావాలని ఆహ్వానించింది. నిజానికి ఈ చర్చలు గురువారం జరగాల్సి ఉంది. అయితే కరోనా ముప్పు, చలిగాలుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రెండు రోజులు ముందుగానే వీటిని నిర్వహించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
కాగా.. చర్చలు జరిపినా కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే ఆలోచనలో లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నూతన చట్టాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైతులు డిమాండ్ చేస్తున్న మద్దతు ధర, మార్కెట్ యార్డులపై మరింత స్పష్టత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.