
తాజా వార్తలు
అమ్మా..! యాంకర్ పేరు చెప్పు
బీబీసీ లైవ్‌లో చిన్నారి అల్లరి
లండన్: కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఆ సమయంలో చిన్నపిల్లల తల్లిదండ్రులు వారి అల్లరిని తట్టుకోవడం కాస్త కష్టమే. ఇక వీడియో కాన్ఫరెన్స్‌ల సమయంలో వారిని పట్టుకోవడం చాలా ఇంకా కష్టం. సమావేశాల మధ్యలో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి, గారాలు పోతుంటారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో నిపుణురాలైన డాక్టర్ క్లేర్ వెన్హామ్ను, బీబీసీ యాంకర్ క్రిష్టియన్ ఫ్రేజర్ లాక్డౌన్ గురించి ఇంటర్య్వూ చేస్తోన్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోన్న సమయంలో క్లేర్ కూతురు తన చేతిలో ఉన్న పెయింటింగ్‌ను సరైన స్థానంలో పెట్టడానికి ప్రయత్నించడం మనకు వీడియోలో కనిపిస్తుంది. అంతటితో ఆగకుండా తన పేరు అడగమంటూ యాంకర్‌తోనే మాట్లాడింది.
పాప పేరు స్కార్లెట్ అని తెలియడంతో.. యాంకర్ ఆమెను పిలిచి, పెయింటింగ్‌ను కింది సెల్ఫ్‌లో పెట్టమని సలహా ఇస్తాడు. అప్పటి కూడా పాప అక్కడి నుంచి వెళ్లకుండా వారి సంభాషణ మధ్యలోకి దూరిపోయి..ఆయన పేరు ఏంటని వాళ్లమ్మను విసిగించింది. ఆ పెయింటింగ్‌ను ఎక్కడ పెట్టాలంటూ వాళ్లమ్మను అడుగుతూనే ఉండటం మనకు కనిపిస్తుంది. ఆ తల్లి మాత్రం ఒకవైపు నవ్వుతూ, మరోవైపు గద్దిస్తూ పాపను ఆపడానికి ప్రయత్నించింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.