జిత్తులమారి డ్రాగన్‌..!

తాజా వార్తలు

Updated : 11/08/2020 16:30 IST

జిత్తులమారి డ్రాగన్‌..!

 చెప్పేదొకటి.. చేసేదొకటి..

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది చైనా తీరు.. ఓ పక్క సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నామని చెబుతూనే మరోపక్క భారీగా ఆయుధాలను తరలిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు వద్ద తిష్ఠవేసిన చైనా సేనలు ఆ ప్రదేశం తమదే అంటూ వాస్తవాధీన రేఖనే మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సైనికుల ఉపసంహరణ.. ఉద్రిక్తతలు చల్లార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నా.. సరిహద్దుల్లో మాత్రం అవేవీ కనిపించడంలేదు. నిన్నే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మరోపక్క ఫోర్బ్స్‌ పత్రిక మాత్రం దీనికి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. భారత సరిహద్దుల్లోకి చైనా దళాలు మరిన్ని ఆయుధాలను చేరవేస్తున్నట్లు పేర్కొంది. 

రెండింతలైన యుద్ధవిమానాల సంఖ్య..

ఓ పక్క చర్చలు జరుగుతుండగానే సరిహద్దుల్లోకి యుద్ధవిమానాలను చైనా తరలించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రక్షణ రంగ నిపుణులు గుర్తించారు. జులై 28వ తేదీన షింగ్‌యాంగ్‌ ప్రావిన్స్‌లోని హోటన్‌ ఎయిర్‌బేస్‌లో 36 యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉండగా.. ఇప్పుడు  వాటి సంఖ్య రెట్టింపైంది. ఈ విషయాన్ని అమెరికా వాయుసేనలోని చైనా ఏరోస్పేస్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. కొత్త 24  జే16 ఫ్లాంకెర్‌ ఫైటర్స్‌ను తరలించింది. మరో ఆరు పాత జే8 ఫైటర్లు, రెండు వై 8జీ రవాణా విమానాలు, రెండు కేజే 500 ఎయిర్‌ బార్న్‌ ఎర్లీవార్నంగ్‌ విమానాలు, రెండు ఎంఐ 17 హెలికాప్టర్లు, సీహెచ్‌ 4 డ్రోన్లను తరలించింది. జూన్‌లో ఇక్కడ కేవలం 12 ప్లాంకెర్‌ ఫైటర్స్‌ మాత్రమే ఉన్నాయి. ఈ స్థావరం లద్దాఖ్‌‌కు‌ అతిసమీపంలోనే ఉంటుంది.  

చైనాను భయపెడుతున్న పర్వతాలు..

చైనా వాయుసేనను హిమాలయ పర్వతాలు వణికిస్తున్నాయి. చైనా వద్ద ఎంత శక్తిమంతమైన విమానాలు ఉన్నాకానీ,  ఎత్తయిన హిమ పర్వతాలను దాటుకొచ్చి దాడులు చేయడం అనేది దాదాపు ఆత్మహత్యతో సమానమే. ఎందుకంటే చైనా వాయుసేన స్థావరాలు అన్నీ సముద్ర మట్టం కంటే వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. దీంతో అక్కడ గాలిసాంద్రత విమానాలకు సహకరించదు. అవి ఎగరడం సవాలుతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో విమానాల బరువును గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అంటే వాటి ఇంధన, ఆయుధ సామర్థ్యంలో సగం మాత్రమే మోసుకెళ్తాయి. ఫలితంగా చైనా విమానాలు ప్రయాణించే దూరం గణనీయంగా తగ్గిపోతుంది.  ఒక వేళ అవి ఎక్కువ దూరం ప్రయాణించాలంటే గాల్లో ఇంధనం నింపేందుకు మరో ట్యాంకర్‌ విమానం అవసరం. భారీ ట్యాంకర్‌ విమానాలు రాడార్లకు తేలిగ్గా దొరుకుతాయి. దీంతో శత్రు భూభాగంపై ఎయిర్‌ రీఫ్యూయలింగ్‌కు ఎవరూ సాహసించరు. ఇక భారత్‌ వైపు ఉన్న వైమానిక స్థావరాలు మొత్తం సముద్ర మట్టానికంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మిరాజ్‌, సుఖోయ్‌ 30లు  పూర్తి ఇంధన, ఆయుధ సామర్థ్యంతో యుద్ధానికి వెళతాయి. వీటిని ఎదుర్కోవడం చైనాకు తలకు మించిన భారం అవుతుంది. భారత పదాతి దళానికి వాయుసేన అండ లభించిందంటే.. చైనా పదాతి దళాల ఆధిపత్యానికి కూడా గండిపడుతుంది. దీంతో అవి  ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చైనా చెప్పుకొనే జే-20లు ఎంత వరకు పనిచేస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

శిక్షణలో భారత్‌కు ఆధిపత్యం..

శిక్షణ విషయంలో భారత వాయుసేనకు కొంత ఆధిపత్యం ఉంది. భారత్‌ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఫ్రాన్స్‌, రష్యా వంటి అగ్రదేశాలతో కలిసి యుద్ధవిన్యాసాలు చేస్తోంది. ఆ సమయంలో పైలట్లు చాలా కొత్త విషయాలు నేర్చుకొంటారు. అదే చైనా  పరిమిత దేశాలతో మాత్రమే యుద్ధవిన్యాసాలు చేస్తోంది.  వీటిల్లో రష్యా వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌తో పోలిస్తే చైనా‌ వద్ద వైమానిక శక్తి ఎక్కువగా ఉన్నా.. కీలకమైన ఆధిపత్యాలు మాత్రం భారత్‌కే ఉన్నాయి.  

చినూక్‌.. అపాచీ.. రాకతో శక్తిమంతం..

భారత వాయుసేనలోకి చినూక్‌ హెలికాప్టర్లు రావడంతో శతఘ్నులు, సాయుధ వాహనాల‌ తరలింపు వేగవంతంగా చేస్తున్నాయి. దీనికి తోడు ఫ్లయింగ్‌ ట్యాంక్‌గా పేరున్న అపాచీ హెలికాప్టర్లు కూడా ఇప్పుడు లద్దాఖ్‌‌ వద్ద సార్టీలకు వెళుతున్నాయి. ఈ హెలికాప్టర్లు  భారీ ఆయుధ సామగ్రితో గాల్లోకి లేస్తాయి. ఇవి చైనా పదాతి దళాలకు భారీగా సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. భారత్‌కు గగనతలంలో ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు చైనా భారీ సంఖ్యలో విమానాల సంఖ్యను పెంచుతోంది. 

1962 యుద్ధానికి ముందు అచ్చం ఇలానే..

భారత్‌ను 1962లో కూడా గల్వాన్‌ లోయలో చైనా  నమ్మించి మోసం చేసింది. చైనా అప్పట్లో కూడా గల్వాన్‌ లోయలోకి తమ దళాలను పంపింది. ఆ తర్వాత  భారత్‌ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుంచి వైదొలగింది. కానీ, 97 రోజుల తర్వాత హఠాత్తుగా భారత్‌పై దాడిని ప్రారంభించి అక్సాయ్‌చిన్‌ను దక్కించుకొంది. ఈ యుద్ధంలో భారీ సంఖ్యలో భారత్‌ యోధులు అమరులయ్యారు. 38,000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది. ఈ విషయాన్ని భారత్‌ ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. బలగాలను పెంచుతున్నప్పుడే భారత్‌ మరింత అప్రమత్తమై విరుగుడు వ్యూహాలను అనుసరించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని