కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!
close

తాజా వార్తలు

Published : 16/12/2020 02:28 IST

కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!

విమర్శలు గుప్పిస్తోన్న బ్రెజిల్‌

సావో పాలో: కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వడంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బ్రెజిల్‌ ప్రకటించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ పనితీరుకు సంబంధించి ఎలాంటి సమాచారం విడుదల చేయలేదని ఆరోపించింది. అంతేకాకుండా అత్యవసర వినియోగ నిర్ణయానికి ఏ సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారనే విషయాన్ని కూడా చైనా వెల్లడించలేదని పేర్కొంది. బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ తాజా ప్రకటనతో చైనా వ్యాక్సిన్‌ పనితీరు మరోసారి చర్చనీయాంశమైంది.

ఆదినుంచే విమర్శలు..

చైనా కంపెనీ సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కరోనా వ్యాక్’ మూడోదశ ప్రయోగాలు బ్రెజిల్‌లో జరుగుతున్నాయి. అయితే, ఈ టీకా‌పై బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో ముందునుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే బ్రెజిల్‌లో అధిక జనాభా కలిగిన సావోపాలో నగరంలో వచ్చే నెలనుంచే చైనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు గవర్నర్‌ జావో డోరియా ప్రకటించారు. అధ్యక్షుడు బోల్సోనారోను శత్రువుగా భావించే సావోపాలో గవర్నర్‌ తాజా నిర్ణయం అక్కడ రాజకీయ వేడికి కారణమయ్యింది. అయితే, చైనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి ఇంకా లభించనప్పటికీ  చైనా వ్యాక్సిన్‌ పంపిణీపై అక్కడి గవర్నర్‌ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌పై చైనా వ్యవహారశైలిని బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ లేవనెత్తింది. ‘జులై నుంచి ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద చైనాలో అందిస్తున్నారు. అనుమతులు ఇచ్చే విధానంలో మాత్రం చైనా పారదర్శకంగా లేదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన విధానాలపై చైనా అధికారుల దగ్గర కచ్చితమైన సమాచారం లేదు. ఏదేమైనా ‘కరోనా వ్యాక్’ టీకా అభివృద్ధిలో బ్రెజిల్‌ అంతర్జాతీయ లీడర్‌ అంటూ నియంత్రణ సంస్థ అధికారి అన్విసా ప్రకటించారు. దీనిపై తాజాగా చైనా స్పందించింది. వ్యాక్సిన్‌ సురక్షిత, సమర్థతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బింగ్‌ స్పష్టంచేశారు.

సమాచారం చెప్పని చైనా..
జులై నెలలోనే సినోవాక్‌ టీకా అత్యవసర వినియోగాన్ని ప్రారంభించిన చైనా, ఇప్పటికే లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ను అందిస్తోంది. అయితే, వ్యాక్సిన్‌ సమర్థత, అత్యవసర వినియోగానికి ఎలా అనుమతి ఇచ్చామన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ బహిరంగపరచలేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ సంస్థలన్నీ ఆయా టీకాల సమర్థతపై ఎప్పటికప్పుడు మధ్యంతర ఫలితాలను విడుదల చేస్తున్నాయి. కానీ, చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ కూడా అక్కడి వ్యాక్సిన్‌లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు సినోవాక్‌ సంస్థ ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే, చైనా చట్టాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే వ్యాక్సిన్‌ను చైనాలో అనుమతించినట్లు సినోవాక్‌ ఈ మధ్యే ప్రకటించింది. తొలి, రెండో దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉన్నట్లు తేలిందని, రోగనిరోధకతను పెంచడంలోనూ మెరుగైన పనితీరు కనబరచినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

చైనాకు చెందిన సినోవాక్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం బ్రెజిల్‌లోనూ కొనసాగుతున్నాయి. అయితే, వీటి మధ్యంతర విశ్లేషణ సమాచారాన్ని ఈ నెల 15న ప్రకటించాలని ముందుగా భావించారు. కానీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, బ్రెజిల్‌లో ప్రయోగ ఫలితాలను డిసెంబర్‌ 23న ప్రకటించే అవకాశాలున్నాయని గవర్నర్‌ డోరియా పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
విదేశీ కంపెనీల్లో డ్రాగన్‌ ఊడలు..!
బైడెన్‌కు చైనా అరుదైన స్వాగతం..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని