
తాజా వార్తలు
అమెరికా బ్లాక్ లిస్ట్‌లో మరిన్ని చైనా కంపెనీలు..!
జాబితా సిద్ధం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్: కరోనా వైరస్‌కు కారణమైన చైనాపై చర్యలు తప్పవని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ కంపెనీలపై ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ముప్పైకిపైగా చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన ట్రంప్, తాజాగా మరో నాలుగు సంస్థలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వీటిలో చైనాకు చెందిన సెమీకండక్టర్ తయారీ సంస్థ (SMIC), చైనా ఆయిల్ కార్పొరేషన్ (CNOOC) వంటి ప్రధాన సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.
ఇప్పటికే చైనా మిలటరీకి సంబంధముందన్న ఆరోపణలతో దాదాపు 31 కంపెనీలను అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధిత జాబితాలో చేర్చుతున్నట్లు అమెరికా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయగా, జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే, తాజాగా మరో నాలుగు కంపెనీలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు 35 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేరిపోనున్నాయి.
ఇలా వస్తోన్న ఈ వార్తలపై చైనా సెమీకండక్టర్ తయారీ సంస్థ(SMIC) స్పందించింది. తమ ఉత్పత్తులు, సేవలు కేవలం పౌరులు, వాణిజ్య వినియోగం కోసం మాత్రమే అని వెల్లడించింది. చైనా మిలటరీతో తమ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. అమెరికా ప్రభుత్వంతో ఇప్పటివరకు నిర్మాణాత్మకంగానే కార్యకలాపాలను కొనసాగించామని.. రానున్న రోజుల్లోనూ ఇదే కొనసాగిస్తామని అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే, చైనా వాణిజ్య సంస్థల ద్వారా అమెరికా వనరులు, మూలధనాన్ని కొల్లగొడుతూ వారి సైనిక, ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర భద్రతా పరికరాలను చైనా అభివృద్ధి చేసుకుంటోందని అమెరికా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు, పౌరులు చైనా కంపెనీల షేర్లు కొనడం, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంపై నిషేధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యే పేర్కొన్నారు. ఈ సందర్భంలో జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టేనాటికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే విషయం ఆసక్తిగా మారింది.