చైనా ‘బెదిరింపు దౌత్యం’!

తాజా వార్తలు

Published : 18/10/2020 10:20 IST

చైనా ‘బెదిరింపు దౌత్యం’!

వాషింగ్టన్‌: అమెరికాలో చైనా స్కాలర్లపై న్యాయశాఖ జరుపుతున్న విచారణను డ్రాగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రతీకారంగా చైనాలో ఉన్న అమెరికా పౌరులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు అమెరికా ప్రభుత్వానికి చైనా హెచ్చరికలు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు ప్రముఖ పత్రిక ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘అమెరికాలో కోర్టుల్లో చైనా స్కాలర్లపై జరుగుతున్న విచారణను వెంటనే ఆపేయాలి. లేదంటే అక్కడ ఉన్న అమెరికా పౌరులు కూడా ఇక్కడి నిబంధనల్ని ఉల్లంఘించినవారవుతారు’’ అని హెచ్చరిక సందేశంలో చైనా పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

అమెరికాలో గత కొన్ని నెలల్లో చైనా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులను అరెస్టు చేశారు. చైనాకు చెందిన ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’(పీఎల్‌ఏ)తో వారికి సంబంధాలున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి సమాచారం అందించలేదన్న ఆరోపణల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అమెరికా పరిశోధన, సైనిక సంస్థల నుంచి కీలక సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లు అభియోగాలు మోపారు.

గతంలో ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌కు చెందిన పౌరుల్ని చైనా బందీలుగా చేసుకుంది. ఆయా దేశాలపై దౌత్యపరమైన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే డ్రాగన్‌ ఈ విధానాన్ని అనుసరిస్తోందని వాషింగ్టన్‌లోని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్ని వారు ‘తాకట్టు దౌత్యం’గా అభివర్ణించారు. వివిధ దేశాల్లో న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్న తమ పౌరుల్ని విడిపించుకునేందుకు చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తెలిపారు. 

దీనిపై అమెరికా విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి నేరుగా స్పందించడానికి నిరాకరించారు. చైనాతో వివిధ నిబంధనల కింద చిక్కులు ఎదుర్కొంటున్న వారు.. వాటిని పరిష్కరించుకునే వరకు ఆ దేశాన్ని విడిచిపెట్టలేరని పేర్కొన్నారు. చైనాకు వెళ్లాలనుకునే వారికి సెప్టెంబరులో వివిధ కారణాలు చెబుతూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ఆయా దేశాలతో దౌత్యపరమైన బేరసారాల్లో పైచేయి సాధించడం కోసం చైనా విదేశీయులను బందీలుగా చేసుకునే ప్రమాదం ఉందని అందులో హెచ్చరించడం గమనార్హం.

ఈ ఆరోపణలపై వాషింగ్టన్‌లోని చైనా దౌత్యాధికారులుగానీ, విదేశాంగ శాఖగానీ స్పందించడానికి నిరాకరించాయి. చైనా సమగ్రతను, జాతీయ భద్రతను కాపాడడంలో భాగంగా వివిధ చట్టాల్ని అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని