రహస్యం బయటపడుతుందని నోరు నొక్కేస్తోందా?
close

తాజా వార్తలు

Published : 06/05/2020 01:37 IST

రహస్యం బయటపడుతుందని నోరు నొక్కేస్తోందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్‌ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్‌ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా ప్రయోగశాలలో నుంచి బయటకు వచ్చిందన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ప్రపంచదేశాల వేళ్లన్నీ చైనా వైపే చూపిస్తాయి. ఇక్కడే చైనాతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారు, దాని వల్ల మృత్యువాత పడిన వారి వివరాలు వెల్లడించడంలో చైనా ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదన్నది అందరినోటా ముక్త కంఠంతో వినిపిస్తున్న నినాదం.

ప్రశ్నిస్తే జైలుకే..

చైనా ప్రభుత్వ విధి విధానాలను పౌరులెవరైనా ప్రశ్నిస్తే, శిక్షలు కఠినంగా ఉంటాయి. నోరు తెరిచిన వాడిని తెరిచినట్టు జైలుకు తీసుకెళ్లి నొక్కేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఫిర్యాదు కూడా చేయడానికి వీల్లేదు. అక్కడి విధానాలు అలా ఉంటాయి. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. దీని గురించి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాళ్లకు నరకయాతన తప్పడం లేదు. అలా ప్రశ్నించిన వారి నోరు నొక్కేందుకు చైనా ప్రయత్నిస్తోందని తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో రాసుకొచ్చింది.

చైనా బెదిరిస్తోందా?

కరోనా పుట్టిల్లు వుహాన్‌ సిటీలోని ఏడుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆ మహమ్మారి బారిన పడి తీవ్రంగా నష్టపోయింది. ఎంతో ఆప్తులైన తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయింది. కరోనా బారిన పడి కోలుకున్న ఆ కుటుంబంలోని కొందరు సభ్యులు చైనా ప్రభుత్వం వేసిన తప్పటడుగులపై ప్రశ్నించాలని అనుకున్నారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అక్కడికి వెళ్లారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు లాయర్‌ దగ్గరకు వెళ్తే, వారి నుంచే వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాసూట్‌ వేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇందుకు తాము సహకరించబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో  ప్రశ్నించినవారిపై బెదింపులకు దిగారు. ‘మాకెంతో ఆప్తులైనా కుటుంబ సభ్యులను కోల్పోయాం. వారి మరణానికి కారణం అడిగితే అధికారులు మాకు శిక్షలు వేస్తున్నారు’ అని టైమ్స్‌ తన కథనంలో రాసుకొచ్చింది.

భయపడి వెనక్కి తగ్గుతున్నారు!

ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇలా ప్రశ్నించిన ప్రతి గొంతుకను చైనా ప్రభుత్వం నొక్కేస్తోందట. పోలీసులను రంగంలోకి దింపి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ప్రశ్నించినా, తీవ్రంగా అణచివేయాలని ఆదేశించిందట. ‘‘తమ హక్కులను కోల్పోతున్నామని అక్కడివారు తీవ్రంగా మదనపడుతున్నారు. వుహాన్‌ కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్ధితులను అంతర్జాతీయ సమాజం చూస్తోంది’’ అని ఒకప్పుడు చైనా ప్రభుత్వం చేతిలో నిర్బంధానికి గురైనా యాంగ్‌జన్కింగ్‌ అనే చైనా పబ్లిక్‌ హెల్త్‌ అడ్వజైర్‌  చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన న్యూయార్క్‌ నగరంలో నివశిస్తున్నారు. ఈ విషయమై వుహాన్‌లో నివశిస్తున్న రెండు, మూడు కుటుంబాలు తనని సంప్రదించాయని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి ప్రయత్నించడంతో వారికి అధికారుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు తమ కేసులను విత్‌డ్రా చేసుకున్నట్లు యాంగ్‌ తెలిపారు.

మృతుల సంఖ్య రెట్టింపు

చైనాలోని హుబేలో కరోనా కారణంగా 4,512మంది చనిపోయినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, స్థానికులు మాత్రం మృతుల సంఖ్య రెట్టింపు ఉంటుందని వాదిస్తున్నారు. ఎందుకంటే అధికారిక గణాంకాల ప్రకారమే 68వేలమందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలారు. అంతేకాదు, కరోనా మృతుల విషయంలో తొలుత సరైన వివరాలను చైనా వెల్లడించలేదు. సుమారు 2వేల మంది చనిపోయినట్లు చెప్పింది. కానీ, గత నెలలో అధికారిక లెక్క ప్రకారం ఆ సంఖ్యను 50శాతం పెంచింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం వల్ల మృతుల సంఖ్యను తగ్గించగలిగామని చైనా చెబుతున్న మాటలను ఏ దేశమూ నమ్మే  పరిస్థితిలో లేదు.

చైనాపై పెరుగుతున్న ఒత్తిడి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా ప్రపంచ దేశాధినేతలందరూ కరోనా విషయంలో చైనా నిజాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా, మన్ను తిన్న పాములా చైనా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ‘కొన్ని దేశాలు ప్రకటిస్తున్నట్లు చైనా నుంచి సరైన నంబర్లను మనం పొందగలమా? అంత జనాభా ఉన్న చైనాలో అది చెబుతున్న సంఖ్య అంతేనా ఉంటుందా’ అంటూ ట్రంప్‌ ప్రశ్నించారు. ది యూరోపియన్‌ కమిషన్‌, స్వీడెన్‌, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చైనా ధోరణిపై మండిపడుతున్నాయి. కరోనా పుట్టుకకు అసలు కారణాలను చైనా వెల్లడించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని