ఒక రోజు ముందే డ్రాగన్‌ యుద్ధవిమానాలు

తాజా వార్తలు

Published : 31/08/2020 15:13 IST

ఒక రోజు ముందే డ్రాగన్‌ యుద్ధవిమానాలు

ఇంటర్నెట్‌డెస్క్‌

ఇప్పటి వరకు పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపు తన సైనిక కార్యకలాపాల్ని ప్రారంభించేందుకు కుట్ర పన్ని తోకముడిచిన డ్రాగన్‌ సేన.. తాజాగా సరస్సు దక్షిణం వైపు కన్నేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగటానికి ఒక్కరోజు ముందే చైనా ముందు జాగ్రత్త చర్యగా జే-20 యుద్ధవిమానాలను లద్దాఖ్‌ సరిహద్దులకు తరలించినట్లు తెలిసింది. హోటన్‌ , గార్‌ గున్సా వాయుసేన స్థావరాల్లో వీటి కదలికలు చురుగ్గా ఉన్నాయి. భారత సరిహద్దులకు సమీపంలో సార్టీలకు కూడా వచ్చినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. 

రెండొందల మంది చైనా సైనికులు గుంపుగా వచ్చి..

ఈ నెల 29న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో 150 నుంచి 200 మంది చైనా సైనికులు నిర్మాణ సామగ్రితో వచ్చి హల్‌చల్‌ చేసినట్లు తెలుస్తోంది. వారి కదలికల్ని ముందుగానే పసిగట్టిన భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇరు పక్షాలూ ఆయుధాలు మాత్రం వినియోగించలేదని సమాచారం. ఘర్షణ జరిగినట్లు మాత్రం ఆర్మీ జారీ చేసిన ప్రకటనలో లేదు. కేవలం రెచ్చగొట్టేందుకు యత్నించినట్లు మాత్రమే తెలపడం గమనార్హం.

తూర్పు లద్దాఖ్‌లో రెండు నెలల క్రితం నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఇంకా పూర్తిగా సమసిపోకముందే చైనా మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. గల్వాన్‌ ఘర్షణకు కారణమైన సైనిక మోహరింపుల్ని డ్రాగన్‌ ఇంకా పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సి ఉంది. పరస్పర సహకారం ఉంటేనే సైన్యం ఉపసంహరణ పూర్తవుతుందని భారత్‌ గత వారం స్పష్టం చేసింది.

ఆదేశాలు  జారీ చేసిన ఆర్మీచీఫ్‌..

సరిహద్దుల్లోని సీనియర్‌ కమాండర్లకు ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవానే కీలక ఆదేశాలు జారీ చేశారు. చైనా పాల్పడే ఎటువంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.  

ఘర్షణలపై పశ్చాత్తాప వ్యాఖ్యల తర్వాత..

గల్వాన్‌లాంటి దురదృష్టకర ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చైనా రాయబారి వీడాంగ్‌ గత వారమే అభిప్రాయపడ్డారు. అందుకు సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా పలు దఫాలు ఇరు దేశాల సైనికాధికారులు జరిపిన చర్చలు- వాటి ఫలితంగా చోటుచేసుకున్న పరిణామాల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే మరోసారి ఇరు దేశాల దళాలు సరిహద్దుల వద్ద తలపడ్డాయి. 

పాంగాంగ్‌ వద్ద వెనక్కి తగ్గని డ్రాగన్‌..

పాంగాంగ్‌ సరస్సు వద్ద మాత్రం చైనా దళాలు వెనక్కి తగ్గేందుకు అంగీకరించడంలేదు. పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఎటువంటి ఫలితం లేకుండానే ముగుస్తున్నాయి. మరోపక్క చైనా మరిన్ని దళాలను తీసుకొచ్చేందుకు వీలుగా రోడ్లు, హెలిపాడ్లు, వంతెనల నిర్మాణాలను కొనసాగిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని