చైనా వాళ్లు మళ్లీ తింటున్నారు..
close

తాజా వార్తలు

Published : 01/04/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా వాళ్లు మళ్లీ తింటున్నారు..

బీజింగ్‌: మానవాళికే ముప్పుగా తయారైన కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు దీనిబారిన పడ్డారు. దీనంతటికీ కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం చైనా వైపు వేలెత్తి చూపక తప్పదు. ఇలాంటి వైరస్‌కి కారణం అక్కడి ఆహారపు అలవాట్లేననే ఆరోపణలున్నాయి. అక్కడి మాంసం విక్రయశాలలు దీనికి ప్రధాన కేంద్రబిందువని భావిస్తున్నారు. అయితే స్వల్ప కాలంలోనే వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌ కారణంగా చైనా అక్కడి జంతు, సముద్రపు జీవుల విక్రయశాలలను మూసివేసింది. తాజాగా చైనాలో ఈ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరణాలు, కేసుల సంఖ్య తగ్గినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సమయంలో అక్కడ మళ్లీ మాంసం విక్రయశాలలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గబ్బిలాలు, పిల్లులు, కుక్కల మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులనుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా అక్కడి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మార్కెట్లలో దీనికోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని నియమించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న సందర్భంలో జంతు విక్రయాలకు అనుమతించడం ద్వారా చైనా గుణపాఠం నేర్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. 

చైనాలో ప్రారంభమైన కొవిడ్ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే వేల ప్రాణాలను బలితీసుకున్న ఈ మహమ్మారితో ప్రపంచం మొత్తం అత్యంత అరుదైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  ఈ దుర్భర
పరిస్థితికి కారణం చైనానే అని అమెరికా అధ్యక్షుడు పలుమార్లు ఆరోపించారు. అక్కడితో ఆగకుండా ఈ వైరస్‌ ను ‘చైనా వైరస్‌’, ‘వుహాన్‌ వైరస్‌’ అని అమెరికా పిలుస్తోంది. వుహాన్‌ నగరంలోనే కరోనా వైరస్‌ తొలికేసు నమోదైనట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ధృవీకరించింది. 
గత నవంబరులోనే మొదటి కేసు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వుహాన్‌లోని ఓ సముద్రపు జీవుల విక్రయశాల నుంచి ఈ వైరస్‌ వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. విస్తృత వేగంతో వ్యాపించిన ఈ మహమ్మారి చైనాలో 3వేలకు పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. మరో 80వేల మంది దీని బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. మాంసం విక్రయశాలలను మూసివేసింది. అయితే తాజాగా వీటిని తెరవడం ఆందోళనకు గురిచేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని