బంతి చైనా కోర్టులోనే ఉంది!
close

తాజా వార్తలు

Updated : 18/09/2020 12:20 IST

బంతి చైనా కోర్టులోనే ఉంది!

బలగాల ఉపసంహరణలో చైనా కుట్రల్ని తిప్పికొట్టిన భారత్‌

దిల్లీ: లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా చైనా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. బలగాల ఉపసంహరణకు ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పైగా మాస్కోలో ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని భారత్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. చైనా కుయుక్తులను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. ఉద్రిక్తతల తగ్గింపు విషయంలో చైనా నిజాయతీగా వ్యవహరించాలని హితవు పలికింది. ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం చేయొద్దని తేల్చి చెప్పింది. వెంటనే యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు విదేశాంగశాఖ గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. 

ఉద్రిక్తతల తగ్గింపు దిశగా ఇరు పక్షాలు కలిసి కృషి చేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ ‌శ్రీవాస్తవ నొక్కి చెప్పారు. ఇటీవల మాస్కోలో కుదిరిన ఒప్పందాల్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేశారు. బలగాల ఉపసంహరణ ఏకకాలంలో జరగాలని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల తగ్గించే దిశగా తొలుత భారతే చర్యలు తీసుకోవాలంటూ బుధవారం చైనా చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ భారత్‌ ఈ ప్రకటన విడుదల చేసింది. పరోక్షంగా భారత కోర్టులోకి నెట్టాలనుకున్న బంతిని తిరిగి చైనా కోర్టులోకే పంపింది. ఇరు పక్షాలు కలిసి వస్తేనే సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. చైనాతో భారత్‌ ఎటువంటి ఘర్షణలు కోరుకోవడం లేదని పార్లమెంటులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా శ్రీవాస్తవ గుర్తుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని