ఆ ఒక్క మాట ఆమె పాలిట శాపమైంది!

తాజా వార్తలు

Published : 28/12/2020 13:27 IST

ఆ ఒక్క మాట ఆమె పాలిట శాపమైంది!

చైనా నియంతృత్వ పోకడలకు ఇదో ఉదాహరణ

షాంఘై: చైనా నియంతృత్వ పోకడలు మరోసారి బయటకొచ్చాయి. కరోనా మహమ్మారి గురించి దేశ పౌరుల్ని అప్రమత్తం చేసిన జర్నలిస్టుకి జైలు శిక్ష విధించి డ్రాగన్‌ తన నిరంకుశత్వాన్ని చాటుకుంది. వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో వుహాన్‌ నగరం నుంచి ప్రత్యక్షప్రసారం ఇచ్చిన ఝాంగ్‌ ఝన్‌(37) అనే మహిళా జర్నలిస్టుకి అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఆమె న్యాయవాది తెలిపారు.

ఝాంగ్‌ ఝన్ ప్రత్యక్ష ప్రసారాలు, రాసిన వ్యాసాలు ఫిబ్రవరి నెలలో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాయి. వైరస్‌ వ్యాప్తి, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఇచ్చిన సమాచారం ప్రజల్ని అప్రమత్తం చేశాయి. కానీ, మహమ్మారి సమాచారాన్ని యావత్‌ ప్రపంచం ముందు దాచిపెట్టాలనుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రభుత్వానికి ఇది ఏమాత్రం రుచించలేదు. ప్రభుత్వం ఏ సమాచారం ఇవ్వకుండానే లాక్‌డౌన్‌ విధించిందన్న ఒక్క మాట ఆమె పాలిట శాపంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గళాన్ని నొక్కేశారు. అప్పటికే వైరస్‌ సమాచారాన్ని తొలుత వెలుగులోకి  తెచ్చిన దివంగత డాక్టర్‌ వెన్‌లియాంగ్‌ సహా మరో ఏడుగురు ప్రజావేగుల్ని ప్రభుత్వం అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేసింది.

తన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఝాంగ్‌ ఝన్‌ జూన్‌లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం బలవంతంగా ద్రవ పదార్థాల్ని ముక్కు నుంచి అమర్చిన ప్రత్యేక గొట్టం ద్వారా అందిస్తోంది. తనకు కఠిన శిక్ష విధిస్తే.. అది ముగిసే వరకు దీక్ష కొనసాగిస్తానని ఝాంగ్‌ ఝన్‌ శపథం చేసినట్లు ఇటీవల ఆమెను కలిసిన ఓ న్యాయవాది తెలిపారు. ఈ వ్యవస్థపై పోరాటం చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారట.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇతరుల సాయం అవసరమవుతోందని ఆమె న్యాయవాది తెలిపారు. మానసికంగానూ ఆమె చాలా కుంగిపోయారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, న్యాయవాదులు ఎంత వారించినా నిరాహార దీక్ష మాత్రం విరమించడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేకులను భయపెట్టేందుకే చైనా ఝాంగ్‌ను పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.

ఝాంగ్‌ పరిస్థితి అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేస్తోంది. చైనా నియంతృత్వ పోకడలకు అదుపు లేకుండా పోతున్న విషయాన్ని తెలియజేస్తోంది. ఝాంగ్‌తో పాటు మరో ముగ్గురు జర్నలిస్టులూ ప్రస్తుతం ప్రభుత్వ అదుపులో ఉన్నారు. వారిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. సాధారణంగా చైనా కోర్టులు ఇలాంటి కఠిన తీర్పుల్ని క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకల సమయంలో వెలువరిస్తుంది. ఈ సమయంలో యావత్తు పాశ్చాత్య ప్రపంచం పండుగ హడావుడిలో ఉంటుందని భావించి ఇలా చేస్తుంటుంది!

ఇవీ చదవండి..

చైనా కుట్ర బయటపడింది

మనసు మార్చుకున్న ట్రంప్‌!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని