రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి 

తాజా వార్తలు

Published : 23/07/2020 02:05 IST

 రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి 

కరోనా సవాళ్లను అధిగమించి వేగంగా నిలదొక్కుకోండి

ఇండియా ఐడియా సమ్మిట్‌ 2020లో మోదీ పిలుపు

దిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమని..అమెరికా సంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇరుదేశాల పరస్పర వృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌ 2020లో భాగంగా మోదీ కీలక ప్రసంగం చేశారు. భారత్‌ నేడు అవకాశాల భూమిగా అభివృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా భారత్‌ - అమెరికా మధ్య సంబంధం గతంలో ఎన్నడూ లేనంత ఉన్నత శిఖరాలకు చేరుకుందని చెప్పారు.  కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమించి వేగంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యూఎస్‌- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ 45వ వార్షికోత్సవం  సందర్భంగా నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో ప్రధాని మాట్లాడారు. ‘బిల్డింగ్‌ ఎ బెటర్‌ ఫ్యూచర్’‌ అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్చువల్‌ సదస్సులో మోదీతో పాటు కేంద్ర విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తదితరులు పాల్గొన్నారు. 

భారత్‌ పట్ల ప్రపంచం ఆశావాదంతో ఉందని మోదీ అన్నారు. దేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆహ్వానిస్తోందని చెప్పారు. 2019-20లో భారత్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 74 బిలియన్‌ డాలర్లుగా ఉందన్న మోదీ..  గత ఏడాది కన్నా ఇది 20శాతం ఎక్కువని చెప్పారు. హెల్త్‌ కేర్‌ రంగంలోకి పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. ఏటా ఈ రంగంలో 22శాతం వృద్ధి ఉందన్నారు.అలాగే, పౌరవిమానం, డిఫెన్స్‌, అంతరిక్షం రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఫైనాన్స్‌, బీమా రంగంతో పాటు ఇంధన, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. 5జీ టెక్నాలజీ, బిగ్‌డేటా ఎనాలసిస్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ తదితర అనేక సాంకేతిక రంగాల్లో భారత్‌లో అవకాశాలు ఉన్నాయని ప్రధాని వివరించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని