కొవిడ్‌ రోగుల ఆందోళన..రహదారి దిగ్బంధం..! 

తాజా వార్తలు

Published : 18/07/2020 00:03 IST

 కొవిడ్‌ రోగుల ఆందోళన..రహదారి దిగ్బంధం..! 

కొవిడ్‌ కేర్‌ సెంటర్లో వసతులపై ఆగ్రహం
అసోంలో ఘటన

గువహటి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో ఆసుపత్రులు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొన్నిచోట్ల బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారుతోంది. దీనిలో భాగంగా కరోనా సోకిన బాధితులు తమకు కనీసం నీరు, ఆహారం కల్పించాలంటూ రోడ్లపైకి వచ్చిన ఘటన తాజాగా అసోంలో చోటుచేసుకుంది. దాదాపు 100మంది కొవిడ్‌ రోగులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో అధికారులు కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసోంలోని కామ్రూప్ జిల్లాలో కరోనా రోగులకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజులుగా అక్కడ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వారినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోపోద్రిక్తులైన 100 మంది కరోనా రోగులు, ఏకంగా ఆసుపత్రి బయటకు దూసుకొచ్చారు. అక్కడే జాతీయ రహదారిని దిగ్బంధించారు. కనీసం ఆహారం, మంచినీరు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వంద మంది కరోనా రోగులు అనూహ్యంగా రోడ్డుమీదకు రావడంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకొని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడి సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోకి వెళ్లినట్లు జిల్లా పోలీస్‌ అధికారులు వెల్లడించారు.

అయితే, దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో సేవలందించే ఆరోగ్య కార్యకర్తలు రాత్రి, పగలు పనిచేస్తుండడంతో ఒత్తిడి పెరిగిందని, అందుకే ఒక్కోసారి ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆ కేంద్రంలో సదుపాయాలు నచ్చకపోతే సొంత ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలని కరోనా బాధితులకు సూచించడం గమనార్హం.

ఇదిలాఉంటే, అసోంలో ఇప్పటివరకు 19,754 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 48మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 10లక్షలు దాటిన కరోనా కేసులు
తొలి లక్ష@100 రోజులు, 9 లక్షలు@59 రోజులే..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని