
తాజా వార్తలు
ఆ 5రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయ్..!
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. గతంతో పోలిస్తే ఈ మహమ్మారి వ్యాప్తి కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ దిల్లీలాంటి చోట్ల మళ్లీ విజృంభిస్తోంది. అక్టోబర్ 29నుంచి నవంబర్ 29 వరకు దేశంలో క్రియాశీల కేసులను ఓసారి పరిశీలిస్తే.. గతంలో కొవిడ్ విలయతాండవం చేసిన కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మరోవైపు, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌లలో యాక్టివ్ కేసులు పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.
అక్టోబర్- నవంబర్‌లో హెచ్చుతగ్గులు ఇలా..
కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత మొత్తంగా చూస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దిల్లీ, యూపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలే అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో టాప్-10లో ఉన్నాయి. అయితే, మరణాల విషయానికి వస్తే మాత్రం మహారాష్ట్రలో అత్యధికంగా 47వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. కర్ణాటకలో 11,765, తమిళనాడులో 11,703, దిల్లీ 9,066, పశ్చిమబెంగాల్ 8376 చొప్పున కొవిడ్‌తో ప్రాణ నష్టం జరిగింది. అయితే, ఈ నెల రోజుల కాలంలో మాత్రం సగటున మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, కేరళలో యాక్టివ్ కేసుల్లో తగ్గుముఖం కనిపించడం విశేషం కాగా.. కొత్తగా కేసులు పెరగడం.. రికవరీ రేటు తగ్గుతుండటంతో దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు తగ్గుదల కనబడటంలేదు.
మరోవైపు, భారత్‌లో కొత్త కేసుల కన్నా రికవరీ అవుతున్నవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆదివారం కొత్తగా మరో 38,772 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 45,333 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు భారీగానే ఉంది. దేశంలో ఇప్పటివరకు 88,47,600 మంది (93.81%) కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం కేవలం 4,46,952 (4.74%) క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో కొవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని మరింతగా మెరుగు పరుచుకున్న భారత్.. రోజుకు దాదాపు 15 లక్షల శాంపిల్స్ పరీక్షించే దిశగా వెళ్తోంది. ఆదివారం 8.76లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14.03 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించినట్టు తెలిపింది.