భారత్‌లో ఒకేరోజు 331మంది మృత్యువాత!
close

తాజా వార్తలు

Updated : 09/06/2020 14:10 IST

భారత్‌లో ఒకేరోజు 331మంది మృత్యువాత!

వారంలో 67వేల కేసులు, 1868 మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గతవారం రోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్‌-19 మహమ్మారికి బలి అవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,66,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 7466మంది మృత్యువాతపడ్డట్లు పేర్కొంది. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 67వేల పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతోపాటు 1868 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో మాత్రం 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ మరింత తీవ్రతరమౌతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని