ఒక్క‌‌ నెల‌లో 4ల‌క్ష‌ల కేసులు, 12వేల మ‌ర‌ణాలు!
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 09:56 IST

ఒక్క‌‌ నెల‌లో 4ల‌క్ష‌ల కేసులు, 12వేల మ‌ర‌ణాలు!

24గంట‌ల్లో 507 మంది మృత్యువాత‌

దిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా భార‌త్లో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,653 పాజిటివ్ కేసులు, 507మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన నుంచి ఒక్క‌రోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవ‌డం ఇదే తొలిసారి. దీంతో బుధ‌వారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల‌ సంఖ్య 5,85,493కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 17,400మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య,‌ కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 3,47,979మంది కోలుకోగా మ‌రో 2,20,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్న వారిశాతం దాదాపు 60కి చేర‌డం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. అయితే, దేశంలో క‌రోనా తీవ్ర‌త‌ పెరుగుతున్న దృష్ట్యా ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ సూచించారు.

జూన్ నెల‌లోనే 4ల‌క్ష‌ల కేసులు, 12వేల మ‌ర‌ణాలు..
దేశ‌వ్యాప్తంగా జూన్ మాసంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. జూన్ 1 తేదీ నాటికి దేశంలో 1,90,535 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, జూన్ చివ‌రినాటికి ఈ సంఖ్య 5ల‌క్ష‌ల 85వేల‌కు చేరింది. దీంతో కేవ‌లం జూన్ నెల‌లోనే 3,94,958 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ మ‌ర‌ణాల సంఖ్య జూన్ 1న 5394గా ఉండ‌గా, జూన్ 30నాటికి 17వేలు దాటింది. ఈ నెలరోజుల స‌మ‌యంలోనే దేశంలో 12వేల మంది చ‌నిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప‌ది రాష్ట్రాల్లోనే 90శాతం కేసులు..
దేశంలో కేవ‌లం ప‌ది రాష్ట్రాల్లోనే క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ముఖ్యంగా కొవిడ్‌19 తీవ్ర‌త అధికంగా ఉన్న‌ మ‌హారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 1,74,761 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 7855మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌హ‌రాష్ట్ర అనంతరం త‌మిళ‌నాడులో క‌రోనా తీవ్రత అ‌ధికంగా ఉంది. తాజాగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 90వేలు దాటింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 1201మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజ‌ధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 87,360కి చేర‌గా 2742మంది చనిపోయారు. గుజ‌రాత్‌‌లోనూ కొవిడ్‌ మ‌ర‌ణాల సంఖ్య 1846కి చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని