
తాజా వార్తలు
అప్పుడే కరోనా వ్యాప్తికి పూర్తిగా బ్రేక్ వేయగలం..
కలెక్టర్లతో తమిళనాడు సీఎం పళనిస్వామి
చెన్నై: ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేయడం వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగామని తమిళనాడు సీఎం పళనిస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత, సంఘటిత ప్రయత్నాల ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లతో కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలను జిల్లాల్లో ఎంత సమర్థంగా అమలుచేయగలిగితే.. అంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.
అప్పుడే కరోనా వ్యాప్తికి బ్రేక్: పళని
వివాహ వేడుకలు, తదితర జన సమూహాలుగా ఏర్పడే సందర్భాల్లో , ఇంటినుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో కొందరు మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారని, ఇంకొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తున్నామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారిందన్నారు. అందువల్ల ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలను కలెక్టర్లు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలన్నారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తేనే కరోనా వ్యాప్తిని పూర్తిగా కట్టడిచేయగలమని చెప్పారు.
కొవిడ్ కట్టడికి రూ.7525 కోట్లు ఖర్చు
కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశసించారని పళని గుర్తు చేశారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లే కొవిడ్ కేసులు తగ్గుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఇప్పటివరకు రూ.7525 కోట్లు ఖర్చుచేసిందని వెల్లడించారు. తమిళనాడులో ఇప్పటివరకు 7,77,616 పాజిటివ్ కేసులు, 11,681 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 13 నుంచి రోజూ 2వేల కంటే తక్కువ కేసులే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మినీ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే సీఎం ప్రకటించారు. ఒక్కో క్లీనిక్‌లో వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారు. ఈ మినీ క్లినిక్‌లు జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.