8శాతానికి దిగువనే పాజిటివిటీ రేటు!

తాజా వార్తలు

Published : 19/10/2020 14:43 IST

8శాతానికి దిగువనే పాజిటివిటీ రేటు!

దిల్లీ: గడిచిన ఆరు నెలలుగా దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ క్రమంగా అదుపులోకి రావడం ఊరట కలిగిస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా బయటపడుతోన్న కేసుల పాజిటివిటీ రేటు 8శాతానికి తగ్గడం వైరస్‌ కట్టడికి నిదర్శనమని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తుడటంతోనే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమైందని స్పష్టంచేసింది. ఇక దేశంలో కరోనా వైరస్‌ సెస్టెంబర్‌ నెలలోనే గరిష్ఠస్థాయిని చేరుకున్నట్లు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత నెలలో నిత్యం దాదాపు లక్ష పాజిటివ్‌ కేసులు బయటపడగా, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 60వేలకు తగ్గింది. నిత్యం భారీ సంఖ్యలో టెస్టులు చేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని కేంద్రప్రభుత్వం తెలిపింది. ప్రతిరోజు దాదాపు 8 నుంచి పది లక్షల కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 7.94శాతానికి పడిపోయింది. అక్టోబర్‌ మూడో వారంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు సరాసరి 6.13శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇలా వరుసగా నాలుగోరోజు 8శాతానికి తక్కువగా నమోదుకావడం ఉపశమనం కలిగించే విషయమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.5కోట్ల కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు కేంద్రం పేర్కొంది.

టెస్ట్‌, ట్రాక్‌, ట్రేస్‌, ట్రీట్‌ల‌తో కేంద్రప్రభుత్వ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలుచేయడంతోనే ఈ ఫలితాలు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అంతేకాకుండా సమర్థవంతమైన ట్రాకింగ్‌ పద్ధతుల్లో వైరస్‌ సోకిన వారిని సాధ్యమైనంత తొందరగా గుర్తించగలుగుతున్నామని పేర్కొంది. వీరికి మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.

దేశంలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా భారీ స్థాయిలో తగ్గుతున్నాయని, ప్రస్తుతం 7లక్షల 72వేల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 10శాతం. ఇదిలాఉంటే నిన్న ఒక్కరోజే దేశంలో 55,722 పాజిటివ్‌ కేసులు, 579మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా సోకిన వారిలో లక్షా 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని