
తాజా వార్తలు
కొవిడ్-19: 1486కు చేరిన మృతులు
బీజింగ్: కొవిడ్-19 బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య తాజాగా 1,483కు చేరింది. గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కొల్పోగా, మరో 4,823 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 64,627కు చేరింది. కొవిడ్-19 బాధితుల్ని గుర్తించే విధానంలో మార్పు తెచ్చిన తర్వాత మరణాలు, కొత్తగా సోకినవారి సంఖ్య బుధవారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నిన్నటితో పోలిస్తే మృతులు, బాధితుల సంఖ్య తగ్గడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 బారిన పడ్డ వారి సంఖ్య 65,210కి చేరింది. మరణించిన వారి సంఖ్య 1,486కు ఎగబాకింది. ఇక వైరస్ నుంచి కోలుకొని ఇప్పటి వరకు ఇంటికి చేరుకున్నవారు 5,954 మంది. జపాన్ నౌకలో వైరస్ సోకిన 175 మందిలో ఒక ప్రయాణికురాలు మరణించిన విషయం తెలిసిందే. దీంతో చైనా వెలుపల మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు, ఫిలిప్పీన్స్, హాంకాంగ్‌లో ఒక్కో మరణం సంభవించిన సంగతి తెలిపిందే. వైరస్ కట్టడికి చైనా తీసుకుంటున్న చర్యల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసించారు.