మరింత క్లిష్ట పరిస్థితిలోకి  అగ్రరాజ్యం?

తాజా వార్తలు

Published : 23/09/2020 15:22 IST

మరింత క్లిష్ట పరిస్థితిలోకి  అగ్రరాజ్యం?

కరోనా మరణాల్లో ఐదోవంతు అమెరికాలోనే

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 తొలికేసు నమోదై ఎనిమిది నెలలు దాటిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అక్కడ సంభవించిన కొవడ్‌ మరణాల సంఖ్య 2,00,005 అని అధికారులు వెల్లడించారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 6.8 మిలియన్లు దాటింది. దీనితో కేసులు, మరణాల సంఖ్యలో కూడా అమెరికాయే తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్‌ మరణాల్లో ఐదో వంతు ఇక్కడే చోటుచేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. ఇదిలా ఉండగా, ఫాల్‌ (శిశిరరుతువు) ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్‌ పరంగా అమెరికా మరింత క్లిష్ట పరిస్థితిలోకి అడుగుపెట్టనుందని.. ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ హెచ్చరించారు.

అంకెల్లో కొవిడ్‌..

న్యూయార్క్‌ రాష్ట్రంలో అత్యధికంగా  33,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 16,069 మరణాలతో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉంది. ఇక టెక్సాస్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ఒక్కోదానిలో కరోనా మరణాలు 13,000 కు పైమాటే అని వెల్లడైంది. మరోవైపు ఇల్లినాయిస్‌, మస్సాచ్యుసెట్స్‌, పెన్సిల్వేనియాల్లో కూడా మృతుల సంఖ్య ఏడువేలను మించిపోయింది. అమెరికాలో తొలి లక్ష మరణాలు మే 27 నాటికి సంభవించగా.. కేవలం నాలుగు నెలల్లోనే ఈ సంఖ్య రెట్టింపు కావటం గమనార్హం. ఇదే తీరు కొనసాగితే, నూతన సంవత్సర ఆరంభానికల్లా 3,70,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నూపథ్యంలో చైనా వల్లనే తమకు, ప్రపంచానికి కూడా ఈ గతి పట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో చైనాను దుయ్యబట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని