
తాజా వార్తలు
చెన్నై ఫ్లైఓవర్‌పై విలాసవంతమైన కార్లు
వరద నీటిలో మునిగిపోకుండా స్థానికుల ఉపాయం
చెన్నై: తమిళనాడును అతలాకుతలం చేసిన నివర్ తుపాన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, భారీ వర్షాల కారణంగా తమ కార్లు వరద నీటిలో మునిగిపోకుండా చెన్నై ప్రజలు ఓ ఉపాయం కనుక్కున్నారు. రాజధాని నగరంలోని వెలాచెరీ ప్రాంతంలోని మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు. దాంతో యజమానులు ఒకరితరవాత ఒకరు తమ వాహనాలను పార్క్ చేశారు. దాంతో ఎన్నడూ చూడని విధంగా విలాసవంతమైన, ఖరీదైన కార్లన్నీ ఒక దగ్గర దర్శనమిచ్చాయని అక్కడి పురపాలక సిబ్బంది మీడియాకు వెల్లడించారు.
కాగా, 2015లో చెన్నైలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా దక్షిణ చెన్నైలోని మడిపక్కమ్, కొట్టుర్పురమ్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, తదితర వాహనాలు వరదనీటిలో మునిగిపోయి, బాగా దెబ్బతిన్నాయి. దీన్ని దృష్టిపెట్టుకొని అక్కడి ప్రజలు ఈ కొత్త పరిష్కారాన్ని కనుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణ
‘నివర్ సైక్లోన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఇరువురు ముఖ్యమంత్రులతో వెల్లడించాం. అవసరంలో ఉన్న వారికి సహకరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
చెన్నై మెట్రో సేవలు ప్రారంభం
కాగా, తుపాన్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పాటు, నివర్ తెల్లవారుజామున పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సైక్లోన్ బలహీనపడటంతో..తమ సేవలు తిరిగి ప్రారంభించనున్నట్లు చెన్నై మెట్రో సంస్థ వెల్లడించింది. గురువారం(26.11.20)మధ్యాహ్నం 12 గంటల నుంచి మెట్రో రైళ్లు నడుస్తాయని సంస్థ ట్వీట్ చేసింది.