భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ పునఃప్రారంభం!

తాజా వార్తలు

Updated : 16/09/2020 09:28 IST

భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ పునఃప్రారంభం!

అనుమతించిన డీసీజీఐ

దిల్లీ: భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తిరిగి ప్రారంభించేందుకు ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’(డీసీజీఐ) డా.వి.జి.సొమానీ అనుమతించారు. రెండు, మూడో దశ ప్రయోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయాలన్న ఆదేశాలనూ వెనక్కి తీసుకున్నారు. అయితే, అత్యంత జాగ్రత్తతో ఈ ట్రయల్స్‌ను కొనసాగించాలని ఆదేశించారు. స్క్రీనింగ్‌ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతుగా అధ్యయనం చేయాలని ఈ ప్రయోగాలను పర్యవేక్షిస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ఆదేశించారు. అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇవ్వాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా నిబంధనలను డీసీజీఐ కార్యాలయానికి సమర్పించాలని కోరారు.

బ్రిటన్‌కు చెందిన ‘డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌(డీఎస్ఎంబీ)తో పాటు భారత్‌ డీఎస్‌ఎంబీ కూడా టీకా ప్రయోగాల పునఃప్రారంభానికి సిఫార్సు చేయడంతో డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా సురక్షితమేనని మెడిసిన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ(ఎంహెచ్‌ఆర్‌ఏ) తేల్చడంతో బ్రిటన్‌లో క్లినికల్స్‌ ట్రయల్స్‌ని పునఃప్రారంభించారు. వారి సిఫార్సుల ఆధారంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ సైతం డీసీజీఐకి వాలంటీర్లకు సంబంధించిన సమాచారంతో పాటు, ప్రయోగాల్లో అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న జాగ్రత్తల్ని పునఃసమీక్షించి పంపించింది. అదనపు భద్రతా పర్యవేక్షణకు సంబంధించిన వివరాలను అందజేసింది. అనుకోని దుష్ప్రభావాలు తలెత్తితే అనుసరించనున్న నియమాలనూ జత చేసింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వారం రోజుల పాటు వాలంటీర్‌పై ఎలాంటి పరిశీలన కొనసాగుతుందో పూర్తి వివరాలతో సమర్పించింది. బ్రిటన్‌, ఇండియా డీఎస్‌ఎంబీ సిఫార్సులతో పాటు.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ సమర్పించిన వివరాల్ని పరిగణనలోకి తీసుకొని క్లినికల్‌ ట్రయల్స్‌ పునఃప్రారంభానికి అనుమతించినట్లు డీసీజీఐ సొమానీ తెలిపారు. 

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బ్రిటిష్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అన్ని అనుమతులూ రావడంతో బ్రిటన్‌లో శనివారం తిరిగి ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. తాజాగా అన్ని నివేదికల్ని పరిశీలించిన డీసీజీఐ భారత్‌లోనూ ప్రయోగాల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. 

ఇదీ చదవండి..
ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని