close

తాజా వార్తలు

ఇస్రో హాఫ్‌ సెంచరీ!

*మిస్టర్‌ డిపెండబుల్‌గా పీఎస్‌ఎల్‌వీ

* శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం
* త్వరలో చిన్నతమ్ముడు ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇస్రో అంతరిక్ష రేసులో ఓ కీలక మైలురాయిని అధగమించింది. నేడు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ48తో మొత్తం ఈ సిరీస్‌లో 50 అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించినట్లైంది. మన శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన 75 మిషన్‌ ఇది. ఇక వాణిజ్య పరంగా ఇస్రో 319 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చింది. సీ47 ప్రయోగంతో 300 మార్కును దాటి 310కి చేరింది. ఇస్రో ఈసారి మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ-సీ48 ద్వారా నింగిలోకి పంపింది. వీటిలో అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు ఉండగా.. ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌లకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. ఇప్పటి వరకు ఇస్రోకు అతిపెద్ద కస్టమర్‌ అమెరికానే! ఆ దేశానికి చెందిన 233 చిన్న ఉపగ్రహాలను రోదసీలోని కక్ష్యలోకి చేర్చింది. 

పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ‘సీ13’ కనపడదు ఎందుకంటే..

ఇస్రో కూడా కొన్ని చిన్నచిన్న సెంటిమెంట్లు ఫాలో అవుతుంది. ఇది పీఎస్‌ఎల్‌వీకి 50వ ప్రయోగం. కానీ,  ప్రస్తుతం ప్రయోగ నౌక సంఖ్య సీ48 మరి మిగిలినవి ఎప్పుడు ప్రయోగించారనే సందేహం అందరిలో ఉంటుంది. వీటిల్లో మూడు నౌకలను ‘డీ’ సిరీస్‌లో ప్రయోగించారు. వీటిల్లో డీ1 ప్రయోగం విఫలమైంది. నాలుగో ప్రయోగం నుంచి సీ సిరీస్‌ మొదలైంది. ‘సి’ అంటే ‘కమర్షియల్‌’ అని అర్థం. ఈ ‘సి’ సిరీస్‌లో 13వ నెంబర్‌ ఉండదు. 13 అనే సంఖ్య మంచిది కాదనే నమ్మకంతో ఇస్రో ఈ నెంబర్‌ను తప్పించింది. నాసా కూడా అపోలో-13 ప్రయోగం విఫలం అయ్యాక ఇక ఏ నౌకలోను 13 నెంబర్‌ను జోడించలేదు. ఇస్రో కూడా అందుకే ఈ సంఖ్యను వదిలేసింది. 

రాహుకాలం..
ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 4.40కి ప్రారంభమైంది. 4.25 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించాలని రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాల్లో నిర్ణయించారు. రాహుకాలాన్ని దృష్టిలో ఉంచుకునే కౌంట్‌డౌన్‌ను ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 4.30వరకు రాహుకాలం ఉంది. దీంతో 4.25 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంట్‌డౌన్‌ను 15 నిమిషాలు ఆలస్యంగా 4.40కి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రయోగ సమయాన్ని మాత్రం మార్చలేదు. అంతేకాదు ఇస్రోలో చాలా ప్రయోగాలకు ముందు ఆ సంస్థ ఛైర్మన్‌లు సూళ్ళూరుపేటలోని శ్రీచెంగాళమ్మ ఆలయం, తిరుమలలో శ్రీవారిని దర్శించుకొంటుంటారు. 

50 ప్రయోగాల్లో రెండే వైఫల్యాలు.. 
పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఇస్రో వాణిజ్య విభాగానికి వెన్నెముక వంటిది. దిగువ భూకక్ష్యలో వాణిజ్య ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం దీని ప్రత్యేకత. దీనిలో తొలి రాకెట్‌ను 20 సెప్టెంబర్‌ 1993లో ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది.  ఆ తర్వాత దాదాపు 36 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇండియన్‌ రీజనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ రోదసీలోకి చేర్చేందుకు ప్రయోగించిన  సీ39 విఫలమైంది. ఇది 2017లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇస్రోకు పీఎస్‌ఎల్‌వీ నుంచి ఎటువంటి వైఫల్యాలు ఎదురుకాలేదు. పీఎస్‌ఎల్‌వీ పేరిట మరో ఘనత ఉంది. సీ 37 ప్రయోగంలో ఒకేసారి 104 చిన్న ఉపగ్రహాలను రోదసి కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరే ఇతర అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించలేదు. 

దేశానికి మరో నిఘా నేత్రం..
ప్రస్తుత ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపిన రిశాట్‌ 2బీఆర్‌1 భారత్‌కు నిఘానేత్రంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇస్రో రిశాట్‌ సిరీస్‌లో కొన్నిటిని ప్రయోగించింది. భారత దళాలకు కొన్ని ప్రదేశాల్లో నిరంతర నిఘా కోసం నాలుగు వరకు రిశాట్‌ సిరీస్‌ ఉపగ్రహాలు అవసరం. వీటిల్లోని ఎక్స్‌బ్యాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ నుంచి స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. పగలు, రాత్రి, మేఘావృతమైన వాతావరణంలో కూడా మంచి ఫిల్టర్లను వినియోగించి నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి. 

దళాలకు కళ్లు.. చెవులుగా ఇస్రో..
ఇప్పటికే ఇస్రో భారత రక్షణకు ఎనలేని సేవలను అందిస్తోంది. భారత్‌కు కమాండ్‌, కంట్రోల్‌, కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్స్‌, ఇంటెలిజెన్స్‌, సర్వైలెన్స్‌, అండ్‌ రికానిసన్స్‌ (సీ4ఐఎస్‌ఆర్‌) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంలో ఇస్రో చేదోడువాదోడుగా ఉంటోంది. గతంలో భారత్‌ అర్ధరాత్రి నిర్వహించిన మెరుపుదాడుల్లో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించాయి. గత నెలలో ప్రయోగంచిన కార్టొశాట్‌ 3లోని  కెమెరా 0.25సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో అత్యంత స్పష్టమైన చిత్రాలను తీయగలదు. అంటే మన శత్రుస్థావరాల్లో ఉన్న చిన్న పరికరాల సమాచారంతో సహా మనం కనుక్కోవచ్చు.  చాలా అమెరికా ఉపగ్రహాల సామర్థ్యం కంటే ఇది ఎక్కువ. ఈ రకంగా, ఇస్రోలో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగులు దేశసేవలో పాలుపంచుకొంటున్నట్లే. దేశీయ జీపీఎస్‌గా పేరున్న నావిక్‌ వ్యవస్థను కూడా ఇస్రో అందుబాటులోకి తెచ్చింది. ఇది అమెరికా జీపీఎస్‌ కంటే అత్యంత కచ్చితత్వంతో ఉన్న ప్రదేశాన్ని వెల్లడించగలదు. యుద్ధసమయంలో శత్రుదేశాలు భారత్‌లోని జీపీఎస్‌ వ్యవస్థ సంకేతాలను నిలిపివేస్తే నావిక్‌ సంకేతాలు అక్కరకొస్తాయి. 

పీఎస్‌ఎల్‌వీకి తోడుగా మరో చిన్న రాకెట్‌ సిద్ధం..

మరోవైపు పీఎస్‌ఎల్‌వీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ని యుద్ధప్రాతిపదికన భారత్‌ అభివృద్ధి చేస్తోంది. దీని సామర్థ్యం 300-500 కిలోల మధ్య ఉండవచ్చని అంచనా. దీన్ని త్వరలోనే ప్రయోగిస్తామని కార్టొశాట్‌-3 ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. చిన్న రాకెట్‌గా వ్యవహరించే దీని ప్రయోగం విజయవంతమై అందుబాటులోకి వస్తే ఇస్రో ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటూ మరింత చవగ్గా ఉపగ్రహాలను ప్రయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని ప్రయోగించడం అత్యంత సులువుగా ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటోంది. పీఎస్‌ఎల్‌వీని ప్రయోగానికి సిద్ధం చేయడానికి ప్రాజెక్టును బట్టి రెండు నెలల వరకు సమయం పడుతుంది. దీనికి ఏర్పాట్లు భారీగానే ఉంటాయి. అదే ఎస్‌ఎస్‌ఎల్‌వీకి ఇందులో నాలుగోవంతు కంటే తక్కువ సమయం సరిపోతుంది. ఖర్చు పరంగా చూసుకొన్నా పీఎస్‌ఎల్‌వీ కంటే చాలా తక్కువ. రూ.30 కోట్లతో ప్రయోగం పూర్తి చేయవచ్ఛు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి కనీసం 600 మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి పదిమంది లోపు బృందం చాలు. యాంత్రిక్స్‌ అంచనా ప్రకారం వచ్చే పదేళ్లలో ఏటా 60 వరకు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.