
తాజా వార్తలు
మాస్కుతో డొనాల్డ్ ట్రంప్!
అధికారుల సూచనతో మాస్కుతో తొలిసారి ప్రజలముందుకు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కు ధరించి ప్రజలముందుకొచ్చారు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రి సందర్శన సమయంలో అధ్యక్షముద్ర ఉన్న మాస్కుతో ట్రంప్ కనిపించారు. వైద్యాధికారుల సూచన మేరకు ట్రంప్ ఈసారి మాస్కు ధరించినట్లు సమాచారం.
కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ అనారోగ్యానికి గురైన ఆరోగ్య సంరక్షకులు, స్వచ్ఛంద సేవా సభ్యులను పరామర్శించడానికి తాజాగా మిలటరీ ఆసుపత్రికి ట్రంప్ వెళ్లారు. అక్కడికి బయలుదేరుతున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 'ఆసుపత్రులకు వెళ్లే సమయంలో మాస్కు ధరించడం అత్యంత ముఖ్య విషయంగా నేను భావిస్తున్నాను' అని అభిప్రాయపడ్డారు. అయితే, గతకొన్ని నెలలుగా అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం మాస్కుధరించడానికి నిరాకరించారు. గతంలో ఒక్కసారి ఫోర్డ్ ప్లాంటును సందర్శించినప్పుడు మాత్రమే కొద్దిసేపు మాస్కు ధరించారు. అంతేకాదు, ఈ విషయంపై విలేకరులు పలుసార్లు ప్రస్తావించినప్పటికీ నేను మాస్కు ధరించనంటూ తెగేసి చెప్పారు. అలాంటిది తాజాగా ట్రంప్ మాస్కు ధరించడం ఆసక్తిగా మారింది.
ఎన్నికల ప్రచారాంశంగా మాస్క్..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి భారీగా పెరిగింది. నిత్యం దాదాపు 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 32లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా లక్షా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లు, అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా మాస్కు ధరించడం తప్పనిసరని పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం మీడియా సమావేశాలు, ర్యాలీలు, బహిరంగసభలు జరిగిన సమయంలోనూ మాస్కు ధరించలేదు. దీంతో ఇది ఎన్నికల ప్రచారాంశంగా మారింది. డెమోక్రటిక్ నేత జో బైడెన్ కూడా ట్రంప్ తీరుపై మండిపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలోనూ అధ్యక్షుడు మాస్కు ధరించకపోవడంపై ఆయన్ని ఒక ఫూల్గా అభివర్ణించారు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడంతోపాటు ప్రజలు, అధికారులనుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అధికారుల సూచనతో చివరకు ట్రంప్ మాస్కు ధరించారని సమాచారం.
ఇవీ చదవండి..
ట్రంప్ నిజంగా ఒక ఫూల్: జో బైడెన్
మీరు మాస్కు ధరించండి..నేను ధరించను: ట్రంప్