ఆగని కార్చిచ్చు.. అమెరికా ఎన్నికలపై ప్రభావం?

తాజా వార్తలు

Published : 15/09/2020 14:34 IST

ఆగని కార్చిచ్చు.. అమెరికా ఎన్నికలపై ప్రభావం?


వాషింగ్టన్‌: అమెరికాలో గత ఆగస్టు 22న కాలిఫోర్నియాలో ప్రారంభమైన కార్చిచ్చు ఉద్ధృతి కొనసాగుతోంది.ఈ దావానలం క్రమేపీ వాషింగ్టన్‌, ఓరేగాన్‌, ఇదాహో రాష్ట్రాలకూ వ్యాపించింది. వెస్ట్‌కోస్ట్‌, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్‌, ఫోర్ట్‌లాండ్‌, ఓరేగాన్‌ తదితర ప్రధాన నగరాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 4.6 మిలియన్ల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు హెలికాప్టర్లు, అగ్నిమాపక శకటాల ద్వారా 30 వేల మంది సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రతకు అనేక భవనాలు కాలిబూడిదయ్యాయి. మరోవైపు కార్చిచ్చు వల్ల విడుదలైన పొగతో గాలి కాలుష్యమై స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఎన్నికలపై ప్రభావం!

మరోవైపు ఈ కార్చిచ్చు ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా పడే అవకాశం కనిపిస్తోంది. మంటలు మొదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇప్పటి వరకు అదుపు చేయలేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.అక్కడి నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని డెమోక్రాట్లు చూస్తున్నారు. తనకు తాను పర్యావరణ ప్రేమికుడని చెప్పుకొన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కేవలం మాటల మనిషేకాని చేతల మనిషి కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కాలిఫోర్నియాలోని మెక్‌లెల్లన్‌ పార్కును ఇవాళ సందర్శించారు. అయితే, అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా స్థానికులు రోడ్డుపైకి వచ్చి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భద్రతా సిబ్బంది కాస్తా దూకుడుగా వ్యవహరించారు. వ్యతిరేక నినాదాల మధ్యే ట్రంప్‌ పర్యటన సాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని