76.7% యాక్టివ్‌ కేసులు అక్కడే: కేంద్రం

తాజా వార్తలు

Updated : 17/11/2020 21:44 IST

76.7% యాక్టివ్‌ కేసులు అక్కడే: కేంద్రం

లక్షణాలుంటే.. పరీక్షలకు వెనుకాడొద్దు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోందని కేంద్రం తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికలు, పండగల ప్రభావంతో వచ్చే వారం లేదా 15 రోజుల్లో కొత్త కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ హెచ్చరించారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల బిహార్‌ ఎన్నికలతో పాటు దేశంలోని పలు చోట్ల ఉప ఎన్నికలు, దుర్గా పూజ, దీపావళి, ఇతర పండుగల ప్రభావంతో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కొత్తగా వస్తున్న కేసులను నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హరియాణా, యూపీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, దిల్లీ, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే 76.7శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. గత 45 రోజుల్లో రికవరీ అయినవారి సంఖ్య పెరుగుతూ వస్తోందని, యాక్టివ్‌ కేసుల్లో తగ్గుదల నమోదైనట్టు ఆయన తెలిపారు. ఎవరికి ఎలాంటి లక్షణం ఉన్నా వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. పరీక్షలు చేయించుకొనేందుకు ఎవరూ వెనుకాడవద్దని విజ్ఞప్తి చేశారు. 

దిల్లీలో కరోనా పరిస్థితిపై కేంద్రం తక్షణ చర్యలు చేపట్టిందని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఐసీయూ పడకలతో పాటు మొత్తం బెడ్‌ల సంఖ్య పెంచిందని, టెస్టింగ్‌ సామర్థ్యాన్ని కూడా రోజుకు లక్ష నుంచి 1.2లక్షలకు పెంచినట్టు చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లు పెంచడంతో పాటు అక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

దిల్లీలోని 4000 కంటైన్‌మెట్ జోన్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేసేందుకు వీలుగా సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. జూన్‌ తర్వాత దిల్లీలో రోజువారీ టెస్ట్‌లను పెంచడంతో ఆగస్టు మధ్య నుంచి కేసుల తీవ్రత తగ్గినప్పటికీ అక్టోబర్‌ నుంచి మళ్లీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయని చెప్పారు.  దిల్లీలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న జోన్‌లలోనూ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. మొత్తంగా 7వేల నుంచి 8వేల బృందాలతో సర్వే చేపట్టనున్నట్టు పాల్‌ తెలిపారు. 

మరోవైపు, దేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మూడో దశలో ఉందన్నారు. దేశంలో దాదాపు ఐదు వ్యాక్సిన్లు ట్రయల్స్‌లో ఉన్నప్పటికీ రెండు టీకాలు మాత్రం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నట్టు పాల్‌ వెల్లడించారు. 

భారత్‌లో కరోనా @ ఈ వారం హైలెట్స్‌.. 
* దేశంలో కోలుకున్నవారి సంఖ్య 82.9లక్షలు దాటింది.
* ప్రస్తుతం రికవరీ రేటు 93 %గా ఉంది.
* రోజుకు సగటున 46,701 మంది కోలుకున్నారు.
* రోజుకు సగటున 40,365 కొత్త కేసులు నమోదయ్యాయి.
* 12.65 కోట్లకు పైగా శాంపిల్స్‌ పరీక్షించారు. 
* దేశంలో మొత్తం పాజిటివిటీ రేటు 7.01% కాగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.1%గా నమోదైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని