
తాజా వార్తలు
సచిన్ పైలట్‌కు తలుపులు తెరిచే ఉన్నాయి: కాంగ్రెస్
జైపుర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని.. ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటుందని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఏమాత్రం ఫలించబోవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉండి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలన్నారు. ప్రతిఒక్కరూ సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కోరారు.
సచిన్ పైలట్ తిరుగుబాటుపై మాట్లాడిన సూర్జేవాలా.. గత 48 గంటల్లో పార్టీ నాయకులు పైలట్‌తో అనేక సార్లు మాట్లాడారని తెలిపారు. పార్టీ ఒక కుటుంబం లాంటిదని వ్యాఖ్యానించారు. ఎవరికైనా.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ ముందుంచాలని కోరారు. దానిపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం స్థిరంగా ఉండేందుకు అధిష్ఠానం అన్నిరకాలుగా సహకరిస్తుందన్నారు. సచిన్ పైలట్‌కి ఇప్పటికీ కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. ఆయన ఎప్పుడైనా అధినాయకత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరఫున తాను ఈ విషయం చెబుతున్నానని తెలిపారు.
ఇప్పటి వరకు 100 మంది ఎమ్మెల్యేలు గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 90 మంది కాంగ్రెస్, 10 మంది స్వత్రంత్రులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు జైపుర్ పార్టీ కార్యాలయంలో సచిన్ పైలట్‌కు సంబంధించిన పోస్టర్లను తొలగించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
సచిన్ పైలట్ భాజపాలో చేరడం లేదా?
ఓవైపు రాజకీయ సంక్షోభం.. మరోవైపు ఐటీ సోదాలు