జైళ్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: మమతా

తాజా వార్తలు

Published : 25/11/2020 17:37 IST

జైళ్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: మమతా

కోల్‌కతా: తనను అరెస్టు చేసినా పశ్చిమబెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో .. జైల్లో ఉండి  విజయం సాధిస్తానని సీఎం మమతాబెనర్జీ అన్నారు. భాజపా నాయకులు తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాలని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం ఆమె బంకురా జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ‘టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు భాజపా వారికి ఆఫర్లు ప్రకటిస్తోంది. కొంత మంది రాష్ట్రంలో కాషాయపార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారు టీఎంసీ నాయకులను భయపెట్టేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం)లను బయటకు తీస్తారు. కానీ ఈ సందర్భంగా వారికి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలచుకున్నా. భాజపాకు గానీ, ఇతర ఏజెన్సీలకు గానీ నేను భయపడేది లేదు. మీకు గనక ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించండి. అయినప్పటికీ నేను జైళ్లో నుంచే ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తా. 

ఇటీవల బిహార్‌లో జరిగిన ఎన్నికలను ఉద్దేశిస్తూ ‘ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను జైల్లో పెట్టారు. అయినప్పటికీ ఆయన పార్టీ మంచి ఫలితాలనే రాబట్టింది. భాజపా కొన్ని అవకతవకల వల్లే గెలిచింది. కానీ ప్రజాదరణ వల్ల మాత్రం కాదు. కొంతమంది తాము అధికారంలోకి వస్తామనే కలలతో టీఎంసీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అది జరగని పని. ఒకవేళ వారు అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మేం ఇంకా ఘనమైన విజయంతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటాం’ అని మమత అన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్‌ పర్యటనలో భాగంగా బంకురా జిల్లాలోని గిరిజన ప్రాంత సందర్శనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని