
తాజా వార్తలు
కట్టడి చేస్తున్నవారితో కలిసి వేడుకలు..
ఆత్మీయత చాటుకున్న రైతన్నలు..
దిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నిరసనల్లో పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ఒకవైపు కేంద్రంపై దృఢవైఖరిని ప్రదర్శిస్తూనే..మరోవైపు, సిక్కు మత వ్యవస్థాపకుడు, ప్రథమ గురువు గురునానక్ జయంతిని జరుపుకొన్నారు. తమ తోటివారికి ప్రసాదాలు పంచారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమను కట్టడి చేస్తోన్న భద్రతాబలగాలనూ ఈ వేడుకలో భాగం చేసుకున్నారు. వారికి ప్రసాదాలు పంచి సోదరభావాన్ని చాటారు.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వృద్ధ రైతుపై పోలీసు లాఠీ ఎత్తిన ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘జై జవాన్, జై కిసాన్ అనేది మన నినాదం. కానీ, మోదీ అహంకార ధోరణితో నేడు బలగాలు రైతులకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
రైతులకు కొవిడ్ పరీక్షలు:
సింఘు సరిహద్దులో నిరసన తెలుపుతోన్న రైతుల కోసం వైద్య సిబ్బంది శిబిరాలను ఏర్పాటు చేశారు. ‘ఇక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఈ ప్రాంతంలో సూపర్ స్ప్రెడర్కు అవకాశం ఉంటే..ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించనుంది. దాంతో ఘోరపరిణామాలు ఎదురుకానున్నాయి’ అని సంబంధిత వైద్యుడొకరు ఆందోళన వ్యక్తం చేశారు.