close

తాజా వార్తలు

Updated : 03/12/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొలిక్కిరాని చర్చలు.. 5న మరోసారి భేటీ!

కేంద్రానికి ఇగో లేదన్న కేంద్రమంత్రి తోమర్‌

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎనిమిది రోజులుగా పోరు కొనసాగిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు ఏడు గంటలపాటు సాగినా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఎల్లుండి (ఈ నెల 5న) మరోసారి రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వ చర్చలకు పిలుపునిచ్చింది. గతంలో జరిగిన చర్చల్లో, నేటి సమావేశంలో రైతు సంఘాల నేతలు పలు అంశాలు లేవనెత్తారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. ఈరోజు సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు సాగాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదన్నారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, వారిలో నెలకొన్న అపోహలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటామని తోమర్‌ అన్నారు. చర్చలు, తుది నిర్ణయం చెప్పేందుకు ఎల్లుండి వరకు గడువు కోరారు. దీంతో సింఘూ సరిహద్దు వద్ద రేపు ఉదయం 11గంటలకు సమావేశమై చర్చలకు హాజరు కావాలో, వద్దో అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు చెబుతున్నారు. చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చినా.. రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.  

చర్చలు సాగాయిలా..
గురువారం 7గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో భాగంగా 35 రైతు సంఘాల నేతలు భోజన విరామ సమయం వరకు తమ అభ్యంతరాలను కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌కు వినిపించారు. రైతుల అభ్యంతరాలను విన్న అనంతరం మధ్యాహ్నం 3గంటలకు భోజన విరామ సమయం తీసుకున్నారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అందుకు గల కారణాలను వివరిస్తూ రైతు సంఘాలు కేంద్రానికి ఒక నివేదికను కూడా సమర్పించాయి. దాంతో పాటు  కొత్తగా తీసుకొచ్చిన చట్టాల ద్వారా రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుందన్న అంశంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వచ్చిన విశ్లేషణలతో కూడిన పత్రికా కథనాలను అన్నదాతలు కేంద్రం ముందు ఉంచాయి. పార్లమెంట్‌ ప్రత్యేకంగా సమావేశమై కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. అయితే, కనీస మద్దతు ధర అంశాన్ని టచ్‌ చేయబోమని, ఈ చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధంగా లేమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతు నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. 

అలాగే, తాము పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముందుగా.. రైతు సంఘాలు, రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలనే తీసుకున్నాకే కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి ప్రతిపాదించాయి. వారి డిమాండ్లను వినడం పూర్తయిన తర్వాత భోజన విరామం తీసుకున్నారు. 

మేం భోజనం తెచ్చుకున్నాం..
చర్చల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ చేసిన ఆహారాన్ని తీసుకొనేందుకు రైతు నేతలు నిరాకరించారు. తాము స్వయంగా తీసుకొచ్చిన ఆహారం తింటామని చెప్పారు. అరగంట పాటు భోజన విరామం తర్వాత తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో రైతులకు కలిగే ప్రయోజనాలు, వాటి పట్ల నెలకొన్న అపోహలపై కేంద్ర మంత్రులు రైతులకు వివరించే ప్రయత్నం చేసినట్టు రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 

అయితే, కనీస మద్దతు ధరకు సంబంధించి లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించగా.. రైతు సంఘాలు తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. మరోవైపు, ఈ కరోనా కష్టకాలంలో దేశ రాజధానిలో చలిని తట్టుకొని రైతులు గత 8 రోజులుగా తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టుదలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం వెలువడబోతోంది అనే అంశం ఉత్కంఠగా మారినప్పటికీ నాలుగో విడత చర్చల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు. Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన