టీకా‌ వస్తే ఏడాదిలో ప్రపంచం సాధారణ స్థితికి

తాజా వార్తలు

Updated : 16/08/2020 16:36 IST

టీకా‌ వస్తే ఏడాదిలో ప్రపంచం సాధారణ స్థితికి

వచ్చే ఏడాది ఆరంభంలో టీకా వచ్చే అవకాశం: ఫౌచి

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు. సురక్షితమైన పద్ధతిలో వచ్చే ఏడాది ఆరంభం లేదా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తే ఆ తర్వాత ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాకు చెందిన పీబీఎస్‌ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2021కి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఏడాదిలోపు ప్రపంచం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. స్మాల్‌పాక్స్‌(అమ్మవారు)పై తప్ప చరిత్రలో ఏ మహమ్మారిపై మానవులు పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఆ వ్యాధులను ఆశించిన స్థాయిలో అదుపుచేయగలిగాం. తర్వాత అవి సాధారణ జనజీవనంపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. అయితే కరోనా కట్టడిలో సరైన మార్గదర్శకాలు పాటించకపోయినా, సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోయినా దాని ప్రభావం మరి కొన్ని ఏళ్ల పాటు తప్పక ఉంటుంది’’ అని అన్నారు.

నవంబరు నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే అది సాధారణ ప్రజలకు చేరడానికి 2021 వరకు సమయం పట్టవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ఫౌచి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలానే రష్యా వ్యాక్సిన్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా వ్యాక్సిన్‌ ఎంత మేర సురక్షితమైందో, అది ఎంత వరకు సమర్థవంతంగా పనిచేస్తుందన్నది పరిశీలించిన తర్వాతే దానిని ప్రజలకు అందివ్వాలని ఫౌచి సూచించారు. అయితే అమెరికా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేసేందుకు తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల రష్యా ప్రకటించింది. అయితే రష్యా సహాయాన్ని అమెరికా తిరస్కరించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని