లొంగిపోతారా లేక..మానెక్‌ షా వార్నింగ్

తాజా వార్తలు

Published : 17/12/2020 01:41 IST

లొంగిపోతారా లేక..మానెక్‌ షా వార్నింగ్

1971 యుద్ధంలో పాక్‌ గుండెల్లో గుబులు రేపిన ఫీల్డ్ మార్షల్ 

దిల్లీ: లొంగిపోతారా?..తుడిచి పెట్టేయమంటారా?.. అని భారత్‌ వైపు నుంచి కంగుమని మోగిందో కంఠం. మరో అవకాశం లేకుండా వచ్చిన హెచ్చరికకు హడలిపోయింది దాయాది సైన్యం. భారత బలగాల ధాటికి తాము తట్టుకోలేమని తెలిసినా..ఇంతసేపు చూపిన ధైర్యం ఎగిరిపోయింది. ఓటమి ఖాయమైన తర్వాత.. ప్రాణాలు దక్కించుకోవడమే మేలనుకుంది. వెంటనే 93,000 మందితో కూడిన పాకిస్థాన్‌ దళం భారత సైన్యం ముందు లొంగిపోయింది. అందుకే ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద లొంగుబాటుగా చరిత్రలో నిలిచి, మన సైన్య పరాక్రమాన్ని ప్రపంచానికి చాటింది. శత్రువుల గుండెల్లో గుబులు రేపిన ఆ కంఠం ఫీల్డ్ మార్షల్ మానెక్‌ షాది. ఆయన పటిష్ట వ్యూహ రచన జరిపి, విజయాన్ని భారత్ పరం చేశారు. ఇదంతా 1971లో పాకిస్థాన్‌ నడ్డివిరిచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పించిన భారత్ సైన్యం ఘనత. ఆనాటి విజయానికి నేటికి 50 ఏళ్లు కావడంతో దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయ్ దివస్ 2020 వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ఇన్‌స్టాగ్రాంలో అప్పటి చిత్రాన్ని షేర్ చేసి, వ్యాఖ్యను జోడించింది. 

‘‘మీరు లొంగిపోండి లేకపోతే తుడిచిపెట్టేస్తాం’ అని డిసెంబర్ 13, 1971న ఫీల్డ్ మార్షల్ మానెక్ షా పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు. ఆ ఒక్క హెచ్చరికతో 93వేల మందికి పైగా పాక్ బలగాలు భారత్ ముందు లొంగిపోవడాన్ని ప్రపంచం చూసింది. ఆ మాటలతో ఆయన ఎప్పటికీ నిలిచిపోయారు’ అని భారత సైన్యానికి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మానెక్‌ షా వ్యూహ రచనను గుర్తుచేసుకుంది. అలాగే గర్వించదగ్గ ఆనాటి చిత్రాన్ని భారత ప్రజలతో పంచుకుంది.

1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్ర్య పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత్ సైన్యం పాక్‌ను ఓడించి, స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. బుధవారం దిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ‘స్వర్ణ విజయ జ్యోతి’ని వెలిగించారు. ఈ ఏడాదితో భారత్ విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’ గా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి:

‘స్వర్ణ విజయ జ్యోతి’ వెలిగించి మోదీ నివాళిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని