close
Array ( ) 1

తాజా వార్తలు

లక్ష మృతదేహాల సంచులకు అమెరికా ఆర్డర్‌

అమెరికాలో 1 - 2.4 లక్షల మంది చనిపోతారని అంచనా

కరోనా @ 10 లక్షలు: మృతులు @ 50వేలు

న్యూయార్క్‌: కంటికి కనిపించని ఒక సూక్ష్మక్రిమి ప్రస్తుతం సమస్త భూమండలాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. చైనాలో మొట్టమొదట వెలుగుచూసిన నావెల్‌ కరోనా వైరస్‌ ఇప్పుడు ధరణిపై కరాళ నృత్యం చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నానికి ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 బాధితుల సంఖ్య పది లక్షలు దాటేసింది. రెండు లక్షల మందికి నయమవ్వగా 53వేల మందికి పైగా మృతిచెందారు. ఇక అమెరికాలో ఒకే రోజు అత్యధిక మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. భారత్‌లో 2,088 కేసులు నమోదవ్వగా 156 మంది స్వస్థత పొందారు. 56 మంది మృతిచెందారు.


లాక్‌డౌన్‌లో సగం ప్రపంచం

భూమ్మీద సగభాగం ఏదో ఒక రూపంలో ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఉంది. దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్‌ ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. అమెరికా, స్పెయిన్‌, బ్రిటన్‌లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు లేకపోవడంతో అమెరికాలో గతవారం అదనంగా 60 లక్షల మందికిపైగా నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరు కోటికి చేరుకోనున్నారు. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చనుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘పరిస్థితిని ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అని ఆర్థికవేత్త ఇయాన్‌ షెఫర్డ్‌సన్‌ అంటున్నారు. ‘మార్చి, ఏప్రిల్‌ నెల జీతాలు తీసుకోని వారి సంఖ్య 1.6-2 కోట్లకు చేరుకోనుందని తెలుస్తోంది. నిరుద్యోగిత రేటు నిలకడగా 13-16 శాతంగా ఉంది’ అని ఆయన తెలిపారు.


ఆర్థిక వ్యవస్థ పతనం

అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు 30 శాతం వరకు పతనమవుతాయని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తెలిపింది. ఉద్యోగాలు లేకపోవడంతో కొనుగోళ్లు మందగిస్తాయని వెల్లడించింది. వైరస్‌తో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 4.1 ట్రిలియన్‌ డాలర్లు అంటే ప్రపంచ ఉత్పత్తిలో ఐదు శాతం తగ్గుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు శుక్రవారం హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దేందుకు అమెరికా, బ్రిటన్‌, భారత్‌ సహా అనేక దేశాల్లో పాలకులు ఉద్దీపన పథకాలను ప్రకటించారు. 15 నెలల్లో అత్యవసర నగదు రూపేణా 160 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను ఆమోదిస్తామని ప్రపంచ బ్యాంకు సైతం వెల్లడించింది.


లక్ష మృతదేహాల సంచులకు ఆర్డర్‌

ప్రపంచ కరోనా బాధితుల్లో పావు వంతు అమెరికన్లే కావడం కలవరపెడుతోంది. అక్కడ మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. జాన్‌ హప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకారం గురువారం ఒక్కరోజే 1,100కి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైట్‌హౌస్‌ విశ్లేషకులైతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యాన్ని కోరడం గమనార్హం. ఆ దేశంలో దాదాపు 85% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కరోనా ప్రజ్వలన కేంద్రమైన న్యూయార్క్‌లో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా బయటకు రావొద్దని నగర మేయర్‌ బిల్‌ డి బ్లేసియో అభ్యర్థించారు. కొన్ని రోజుల వరకు మాస్క్‌లు ధరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కోరారు.


ఐరోపాలో తగ్గుముఖం

కొన్ని వారాలుగా కొవిడ్‌-19కు ప్రజ్వలన కేంద్ర (హాట్‌స్పాట్‌)మైన ఐరోపాలో పరిస్థితి ఉచ్ఛ స్థితికి చేరుకోనుంది. గత 24 గంటల వ్యవధిలో స్పెయిన్‌లో 950, బ్రిటన్‌లో 569 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారిలో అర్ధభాగం ఇటలీ, స్పెయిన్‌ వారే కావడం గమనార్హం. అయితే ఇప్పుడా దేశాల్లో పరిస్థితి మెల్లమెల్లగా కుదురుకుంటోంది. మహమ్మారి నియంత్రణలోకి వస్తోందని, సంక్రమణ మందగించిందని స్పెయిన్‌ ఆరోగ్య మంత్రి సాల్వడార్‌ అన్నారు.


యువతా మేలుకో

కొవిడ్‌-19తో కేవలం వృద్ధులు మాత్రమే చనిపోతారన్నది అపోహేనని ప్రస్తుతం స్పష్టమవుతోంది. కేవలం పెద్ద వయస్కులనే వైరస్‌ ఇబ్బంది పెడుతుందనేది అవాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి హన్స్‌ క్లూగ్‌ గురువారం అన్నారు. యుక్త, నడి వయస్కుల్లో చాలామందికి క్రిటికల్‌ కేర్‌ అవసరం అవుతోందన్నారు. కొందరు చనిపోయారని వెల్లడించారు. వారం వ్యవధిలోనే రోజుకు లక్ష మందిని పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదేశించారు. ఆ దేశంలో తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం వేగం పుంజుకుంది. అదనంగా 1500 మందికి చికిత్స అందించేలా రెండు ఆస్పత్రులు సిద్ధమయ్యాయని ప్రభుత్వం తెలిపింది.


రష్యాలో పొడిగింపు

కొన్ని రోజుల్లోనే కరోనా కేసులు సంఖ్య 3500కు చేరుకోవడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కఠిన చర్యలకు ఉపక్రమించారు. పని చేయనప్పటికీ వేతన చెల్లింపు దినాలను ఏప్రిల్‌ చివరి వరకు పొడిగించారు. చాలా నగరాల్లో లాక్‌డౌన్‌ అమలవుతోంది. శుక్రవారం నుంచి థాయ్‌ల్యాండ్‌లో కర్ఫ్యూ విధించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను మింగేందుకు కొవిడ్‌-19 ఉవ్విళ్లూరుతోంది. అలా జరిగితే ఇప్పటికే పేదలున్న ఆ దేశాలకు చాలా కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


నైజీరియాలో కార్చిచ్చు

బొకో హరామ్‌ ఉగ్రవాద సంస్థ తిరుగుబాటుతో ఈశాన్య నైజీరియాలో 18 లక్షల మంది ప్రజలు ప్రత్యేక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. వైరస్‌ను నియంత్రణకు అక్కడ ఎలాంటి ఆరోగ్య వ్యవస్థ లేదు. ఇక్కడ కరోనా వ్యాప్తి కార్చిచ్చులా వ్యాపించే ప్రమాదముందని ఐరాస ప్రతినిధి ఒకరు అన్నారు. పరిస్థితిని తలచుకుంటేనే భయమేస్తోందని పేర్కొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.