బెంగాల్‌లో శాంతిభద్రతలు ఆందోళనకరం: గవర్నర్‌

తాజా వార్తలు

Published : 06/06/2021 18:43 IST

బెంగాల్‌లో శాంతిభద్రతలు ఆందోళనకరం: గవర్నర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేదిని సూచించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల్లో అధికారపక్షంతో పోలీసులతో రాజీపడ్డారని ఆరోపించారు. సంబంధిత ట్వీట్‌ను మమతా బెనర్జీని కూడా ట్యాగ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. భద్రతా విభాగం పూర్తిగా రాజీ వైఖరి అవలంబిస్తోంది. ఈ క్రమంలో పరిస్థితులను వివరించేందుకు సీఎస్‌ను సోమవారం (జూన్‌ 7న) కలవాలని సూచించా’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. ‘‘తృణమూల్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దీంతో లక్షలాది మంది తరలిపోతున్నారు. వందలకోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సొంత ఇళ్లలో ఉండాలన్నా, సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా దోపిడీ రుసుము చెల్లింల్సి వస్తోంది’’ అని గవర్నర్‌ ఆరోపించారు. అధికార పార్టీ చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్య విలువలు కూనీ అవుతున్నాయని ట్విటర్‌లో రాసుకొచ్చారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని