చైనీయులకు నో ఎంట్రీ..మేం చెప్పలేదు

తాజా వార్తలు

Updated : 28/12/2020 19:09 IST

చైనీయులకు నో ఎంట్రీ..మేం చెప్పలేదు

మీడియా వార్తలను కొట్టిపారేసిన విమానయాన శాఖ మంత్రి 

దిల్లీ: భారత్‌లోకి చైనీయుల ప్రవేశంపై నిషేధం విధించారంటూ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘ఏ దేశ పౌరుడు రావాలో సూచనలు చేయడం తప్పు. మావైపు నుంచి ఆలాంటి ఆదేశాలు వెళ్లలేదు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. చైనా జాతీయులు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేలా విమానయాన సంస్థలకు కేంద్రం అనధికారిక సమాచారం ఇచ్చిందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి స్పష్టతనిచ్చారు. 

చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ ప్రారంభమైన తరుణంలో మార్చి 23 నుంచి విమాన సర్వీసులను రద్దు చేస్తూ అప్పట్లో కేంద్ర నిర్ణయం తీసుకుంది. అయితే..ఆ దేశీయులు మాత్రం పర్యాటక వీసాలు మినహాయించి ఇతర వీసాలపై భారత్‌కు చేరుకున్నారు. అలాగే మన దేశం ఎయిర్‌ బబుల్ అగ్రిమెంట్ చేసుకున్న దేశాల నుంచి కూడా వారు ఇక్కడి వస్తున్నారు.

ఇదిలా ఉండగా..నవంబర్ నుంచి భారత ప్రయాణికుల ప్రవేశంపై చైనా పరిమితులు విధించింది. దీనికి సంబంధించి భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న ఓ ప్రకటన విడుదల చేసింది. ‘కొవిడ్-19 కారణంగా విదేశాల నుంచి చైనాకు ఎవరూ రాకుండా తాత్కాలికంగా నిషేధం విధించాం. వీసాలు, నివాస అనుమతులు కలిగిన విదేశీయులు భారత్‌ నుంచి చైనాలోకి ప్రవేశించడాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది. అలాగే కొన్ని నెలలుగా వేచి చూస్తున్న రెండు సరకు రవాణా నౌకలకు చైనా అనుమతి ఇవ్వకపోవడం కూడా మీడియా వార్తలకు కారణమైంది. అందులో 39 మందికి పైగా భారతీయులు చిక్కుకొని ఉన్నారు. వాటికి అనుమతి ఇవ్వకపోవడానికి కరోనా వైరస్ కారణమని చైనా చెప్పినప్పటికీ, వాటిలో ఆస్ట్రేలియా బొగ్గు ఉందని భావించడమే అసలు కారణం. ఇటీవల కాలంలో ట్రేడ్ వార్‌తో చైనా, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు ఒడుదొడులకు లోనయ్యాయి. పై రెండు ఘటనలతో భారత్ కూడా చైనీయుల రాకపై ఆంక్షలు విధించినట్లు వార్తలు వచ్చాయి.  

ఇవీ చదవండి:

ఒక్క మాట ఆమె పాలిట శాపమైంది

3రోజులు..300లోపు కొవిడ్ మరణాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని