టీకా పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలివే..

తాజా వార్తలు

Updated : 14/12/2020 17:29 IST

టీకా పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలివే..

దిల్లీ: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ మరికొద్ది వారాల్లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు వృద్ధులకు టీకా ఇవ్వాలని యోచిస్తోన్న కేంద్రం.. తాజాగా వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 నుంచి 200 మందికి టీకా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించింది. 

వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, అలాంటివారినే టీకా కేంద్రాల్లో అనుమతించాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. స్పాట్ రిజిస్ట్రేషన్‌ వంటివాటికి అవకాశం లేదని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన టీకాను కేటాయిస్తే మంచిదని సూచించింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ రకం వ్యాక్సిన్లతో గందరగోళం తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది. వ్యాక్సిన్‌ క్యారియర్‌, వ్యాక్సిన్‌ వయల్స్‌, ఐస్‌ ప్యాక్‌లకు సూర్యరశ్మి తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. 

కేంద్రం ఇంకేం చెప్పిందంటే..

* టీకా పొందే వ్యక్తి కేంద్రానికి వచ్చేంతవరకు వ్యాక్సిన్‌, డైల్యుయెంట్లను వ్యాక్సిన్‌ క్యారియర్‌లో జాగ్రత్తగా మూసి ఉంచి పరిరక్షించాలి.

* టీకా సెషన్‌ పూర్తయిన తర్వాత ఐస్‌ప్యాక్స్‌, ఓపెన్‌ చేయని వ్యాక్సిన్‌ వయల్స్ ఉన్న వ్యాక్సిన్‌ క్యారియర్‌ను తిరిగి కోల్డ్‌ స్టోరేజీ పాయింట్‌కు పంపించాలి.

* ఒక్కో వ్యాక్సినేషన్‌ బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ వ్యాక్సిన్‌ కేంద్రం పెద్దగా ఉండి.. వెయిటింగ్‌ రూమ్‌, పరిశీలన గదిలో సరిపడా స్థలం ఉంటే మరో వ్యాక్సినేటర్ అధికారిని ఏర్పాటు చేసి 200 మందికి టీకా ఇవ్వొచ్చు.

* తొలి ప్రాధాన్యంలో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 50ఏళ్ల పైబడిన వారికి టీకా ఇవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి 50ఏళ్ల లోపువారికి అందించాలి. 

* ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఓటర్ల జాబితా ఆధారంగా 50ఏళ్లు పైబడిన వారిని గుర్తించాలి. 

* వ్యాక్సిన్‌ వేసే గదిలోకి ఒక్కరినే అనుమతించాలి. టీకా తీసుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని 30 నిమిషాల పాటు పరిశీలించాలి.

టీకా పంపిణీ కోసం కేంద్రం Co-WIN వెబ్‌సైట్‌ను తీసుకురానుంది. ఇందులో ఆధార్‌కార్డ్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తొలి దశ టీకా పంపిణీలో భాగంగా దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ప్రణాళిక వేస్తోంది. 

ఇవీ చదవండి..

భారత్‌లో త్వరలోనే కొవిడ్‌ టీకా 

కరోనా కేసులు.. మరోసారి 30వేల దిగువకు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని