గాజులు వద్దు.. గోళ్ల రంగూ వద్దు

తాజా వార్తలు

Published : 07/10/2020 02:09 IST

గాజులు వద్దు.. గోళ్ల రంగూ వద్దు

దిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా తాత్కాలికంగా మూతపడిన పాఠశాలలను ఈ నెల 15 నుంచి తెరచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అణువణువూ శుభ్రం చేయాలని తెలిపింది. పాఠశాలకు వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిగా మాస్కులు ధరించాలని నిబంధనల్లో పేర్కొంది. మహమ్మరి కాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది. అయితే పాఠశాలల్లో  అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 

పిల్లలకు వడ్డించే వారు గాజులు, గోళ్లరంగు, బంగారు ఆభరణాలు, వాచీలు పెట్టుకోరాదని కేంద్రం స్పష్టం చేసింది. పాఠశాలలో వంట చేసేవారితోపాటు వారి సహాయకులు కూడా పరిశుభ్రంగా ఉంటామని పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి అధికారులు వీటిని పర్యవేక్షిస్తుంటారు. పాఠశాలలోకి ప్రవేశించే ముందు కచ్చితంగా అందరూ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ఇన్నాళ్లూ విద్యార్థులందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించే వారు. కానీ, ఇకపై పిల్లలకు విడతల వారీగా వడ్డించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో అవసరమైతే వాళ్ల తరగతి గదుల్లోనే భోజన సదుపాయం కల్పించాలి. పాఠశాల ఆవరణల్లో ఉమ్మడం, చీదడం పూర్తిగా నిషేధం. వంటచేసేవారు కచ్చితంగా యాప్రాన్స్‌, ముఖ కవచాలు ధరించాలి. కూరగాయాలను ఉప్పు, పసుపుతో పరిశుభ్రంగా కడిగిన తర్వాతనే కోయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని