కరోనా రోగులకు ఏం ఏర్పాట్లు చేశారు.. 

తాజా వార్తలు

Published : 11/11/2020 23:58 IST

కరోనా రోగులకు ఏం ఏర్పాట్లు చేశారు.. 

దిల్లీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఆస్పత్రుల్లో చేసిన ఏర్పాట్లపై హైకోర్టు విచారణ జరిపింది. కొవిడ్‌ సోకడంతో ఆరోగ్యం క్లిష్టంగా మారిన వారు ఆస్పత్రులకు వస్తే అలాంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఆప్‌ సర్కార్‌ను ఆదేశించింది. దిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలంటూ రాకేశ్‌ మల్హోత్ర అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ హిమ కొహ్లీ, సుబ్రమణియమ్‌ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తన ఇంటి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో గానీ, నర్సింగ్‌ హోంలో గానీ తనకు బెడ్‌ దొరకలేదని, చివరకు ద్వారకలోని తన స్నేహితుడి క్లినిక్‌లో చికిత్సపొందిన విషయాన్ని పిటిషన్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీలోని  ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలలో చికిత్స, బెడ్‌ల కోసం అవస్థలు పడుతున్న వేలాది మంది దిల్లీ వాసుల్లో మల్హోత్ర కూడా ఒకరని కోర్టు తెలిపింది. కరోనా రోగుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారా? అని ప్రశ్నించింది. ప్రతిఒక్కరూ ఆస్పత్రుల్లో పడకల కోసం ఇబ్బంది పడుతున్నారని, జడ్జిలకు కూడా కొందరు ఫోన్లు చేసి బెడ్‌లు ఇప్పించేలా చూడాలని కోరుతున్నారని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షలు చేయించుకున్నవారికి త్వరగా రిపోర్టులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సత్యకం స్పందిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన ఆరు గంటల లోపు శాంపిల్స్‌ ల్యాబ్‌కు చేరాలని, పరీక్ష అనంతరం మరో ఆరు గంటల్లోనే రోగులకు నివేదిక అందించాలని ఈ నెల 6న అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని