
తాజా వార్తలు
మాస్క్ ధరించకుండా తుమ్మితే..
కరోనా వ్యాప్తిపై ఐఐటీ భువనేశ్వర్ అధ్యయనం
భువనేశ్వర్: కరోనా వైరస్ సంక్రమణను నియంత్రించేందుకు భౌతికదూరం, మాస్కుల ఆవశ్యకత గురించి మొదటి నుంచి వైద్యనిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐఐటీ భువనేశ్వర్ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడిచేసింది. మాస్కులు పెట్టుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని పరిమిత ప్రాంతానికి కట్టడి చేయొచ్చని పేర్కొంది. స్కూల్ ఆఫ్ మెకానికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేణుగోపాల్ అరుమురు నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.
తుమ్మినప్పుడు విడుదలయ్యే తుంపర్లను మాస్కులు, ఫేస్ షీల్డ్ ఒక అడుగు నుంచి మూడు అడుగులకు పరిమితం చేస్తాయని, అదే మాస్కు వాడకపోతే ఆ తుంపర్లు 25 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే, మాస్కులు ధరించినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోవచ్చని, అందుకే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాస్కులు ధరించి ఉన్నా సరే మోచేతిని, చేతిని అడ్డుపెట్టుకోవాలని సూచించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం అతి పెద్ద సవాలుగా మారిందని, దీనికి సంబంధించి వివిధ రకాలైన మాస్కుల సమర్థతను పరిశీలించామని అధ్యయనకర్తలు వెల్లడించారు. అలాగే భౌతిక దూరం పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. ఆరు అడుగుల భౌతిక దూరం కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తుందని ఇప్పటికే వెల్లడైందని, ప్రజలు ఈ నిబంధనను పాటించాలని వారు సూచించారు.