భారత్‌లో 1.65లక్షలకు చేరిన కరోనా కేసులు
close

తాజా వార్తలు

Updated : 29/05/2020 16:35 IST

భారత్‌లో 1.65లక్షలకు చేరిన కరోనా కేసులు

దిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ తరువాత  24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే, కరోనా మరణాల్లో భారత్‌, చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్‌ మరణాలు సంభవించగా భారత్‌లో ఈ సంఖ్య 4706గా ఉండటం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాకుండా కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి ఎగబాకింది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, లక్షా 60వేల కేసులతో టర్కీ 10స్థానంలో కొనసాగుతోంది.

కేసుల్లో చైనాకంటే రెట్టింపు..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 59లక్షల మంది ఈ వైరస్‌ బారినపడగా.. వీరిలో మూడున్నర లక్షల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో సంభవించిన కరోనా మరణాల సంఖ్యలో భారత్‌ చైనాను దాటేయగా, కేసుల్లో చైనా కంటే రెట్టింపుగా ఉండటం వైరస్‌ విజృంభణను స్పష్టం చేస్తోంది. చైనాలో ఇప్పటి వరకు 82,995 కేసులు నమోదుకాగా భారత్‌లో ఆ సంఖ్య నేటికి 1,65,799గా ఉంది.

9వస్థానంలో భారత్‌, 15వ స్థానానికి చైనా..

ఈ మహమ్మారికి చైనా కేంద్రబిందువైనప్పటికీ వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలో 15వస్థానంలో కొనసాగుతోంది. అత్యధికంగా అమెరికాలో 17లక్షల మందికి వైరస్‌ సోకగా ఇప్పటివరకు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తరువాత రెండవ స్థానంలో బ్రెజిల్‌ ఉండగా.. రష్యా, స్పెయిన్‌, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, టర్కీ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభణ విస్తృత వేగంతో కొనసాగుతున్నప్పటికీ చైనాలో మాత్రం కేసుల సంఖ్య అతి స్వల్పంగా ఉండటం గమనార్హం.

కొవిడ్‌ మరణాల్లో 13వస్థానంలో భారత్‌..

ఇక కరోనా సోకి మరణిస్తున్న వారి సంఖ్యలోనూ అమెరికా తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ వైరస్‌ సోకినవారిలో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. రెండవ స్థానంలో యూకే ఉండగా..ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బ్రెజిల్‌, బెల్జియం, మెక్సికో, జర్మనీ, ఇరాన్‌లు టాప్‌ టెన్‌లో ఉన్నాయి. 4706 మరణాలతో భారత్‌ 13వ స్థానంలో కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని