చైనా బలగాల మోహరింపుపై తీవ్ర అభ్యంతరం

తాజా వార్తలు

Updated : 11/09/2020 10:53 IST

చైనా బలగాల మోహరింపుపై తీవ్ర అభ్యంతరం

దిల్లీ: సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తుండడం పట్ల భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సైనికులు, ఆయుధాల్ని సరిహద్దులకు చేరుస్తుండడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మాస్కోలో జరుగుతున్న ఎస్‌సీవో భేటీ సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీకి మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలియజేశారు. గురువారం ఇరువురి మధ్య రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఉద్రిక్తతల తగ్గింపు దిశగా ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సరిహద్దుల్లో అవలంబిస్తున్న దురుసు వైఖరి పట్ల భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దుల విషయంలో ఇరు దేశాల మధ్య 1993, 1996లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది. సరిహద్దు నిర్వహణ విషయంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో భారత్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది.  

ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఎంతో కీలకమని జైశంకర్‌ స్పష్టం చేశారు. అలా అయితేనే ద్వైపాక్షిక బంధం సాఫీగా ముందుకు సాగుతుందని తెలిపారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితులతో ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు నెలకొన్న అన్ని ప్రాంతాల నుంచి వెంటనే బలగాల్ని ఉపసంహరించాలని జైశంకర్‌ తేల్చి చెప్పారు. అలా అయితేనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉంటాయని వివరించారు. చివరగా శాశ్వత స్థావరాలకు తమ బలగాల్ని తరలించే ప్రక్రియను మిలిటరీ కమాండర్లే ఖరారు చేయాలని ఉభయులూ నిర్ణయించారు.

ఇదీ చదవండి..

ఉద్రిక్తతలు ఇలా తగ్గించుకుందాం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని