ప్రపంచంలోనే 4వ స్థానానికి భారత్‌!

తాజా వార్తలు

Updated : 12/06/2020 09:53 IST

ప్రపంచంలోనే 4వ స్థానానికి భారత్‌!

ఒకేరోజు 10,956 కేసులు, 396 మరణాలు

దిల్లీ: కరోనా వైరస్‌ ధాటికి భారత్‌ అతలాకుతలం అవుతోంది. దేశంలో గతకొన్ని రోజులుగా నిత్యం దాదాపు పదివేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 పాజిటివ్‌ కేసులు బయటపడడంతోపాటు 396మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడిననుంచి ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2,97,535 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 8498మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ప్రపంచంలోనే 4వ స్థానంలో భారత్‌..

తాజా కేసులతో ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. ఇప్పటివరకు 2,92,000 పాజిటివ్‌ కేసులతో నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను తాజాగా భారత్‌ దాటేసింది. ప్రపంచంలో 20లక్షల కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 8లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 5లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా భారత్‌ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరడం కలవరపెడుతోంది.

10రోజుల్లోనే లక్ష కేసులు, 3వేల మరణాలు..

భారత్‌లో గతకొన్ని రోజులుగా నిత్యం దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో గడచిన పదిరోజుల్లోనే దేశంలో 98,829 కేసులు, 2900 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి. జూన్‌ 2వ తేదీన 1,98,706 పాజిటివ్‌ కేసులు, 5598 మరణాలు ఉండగా జూన్‌12 నాటికి ఈ సంఖ్య 2,97,535కేసులు, 8498 మరణాలకి చేరింది. ఇదిలాఉంటే, ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 1,47,195 మంది కోలుకోగా మరో 1,41,842 మంది కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకునే వారిసంఖ్య కూడా పెరగడం కాస్త ఊరటనిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని