భార‌త్‌: ర‌ష్యాను దాటి మూడో స్థానంలోకి..!
close

తాజా వార్తలు

Published : 06/07/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార‌త్‌: ర‌ష్యాను దాటి మూడో స్థానంలోకి..!

క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలోనే మూడోస్థానంలోకి భార‌త్‌
కొవిడ్ మ‌ర‌ణాల్లో మాత్రం ఎనిమిదో స్థానం..
24గంట‌ల్లో 24,248 కేసులు, 425మ‌ర‌ణాలు

దిల్లీ: భార‌త్‌లో క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త‌కొన్ని రోజులుగా నిత్యం 20వేల‌కు పైగా రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం నాటికి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల జాబిజాతో భార‌త్ మూడో స్థానంలోకి చేరింది. దాదాపు 29ల‌క్ష‌ల కేసులు, ల‌క్షా 30వేల మ‌ర‌ణాల‌తో అమెరికా అగ్ర‌స్థానంలో ఉండ‌గా, 16ల‌క్ష‌ల పాజిటివ్ కేసుల‌తో బ్రెజిల్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక 6ల‌క్షల 80వేల‌తో మూడోస్థానంలో ఉన్న ర‌ష్యాను తాజాగా భార‌త్ దాట‌వేసింది. నిన్న ఒక్కరోజే భార‌త్‌లో 24,248పాజిటివ్ కేసులు న‌మోదుకావడంతో ఈ స్థాయిని చేరింది. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ మొత్తం బాధితుల సంఖ్య 6,97,413కి చేరింది. కొత్త‌గా 425మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 19,693గా న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. భార‌త్‌లో క‌రోనా బారిన‌ప‌డ్డ‌వారిలో ఇప్ప‌టివ‌రకు 4,24,433 మంది కోలుకోగా మ‌రో 2,53,287యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

ఐదు రోజుల్లో ల‌క్షా 12వేల కేసులు..

జులై మాసం ప్రారంభం నుంచి అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌ల‌లోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉన్న‌ అమెరికాలో ఈ ఐదురోజుల్లో దాదాపు 2,48,000 కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా, బ్రెజిల్‌లో 2ల‌క్ష‌ల పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయి. భార‌త్‌లోనూ గ‌డ‌చిన ఐదురోజుల్లో 1,12,000 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం వైర‌స్ విజృంభ‌ణ‌కు అద్దం ప‌డుతోంది. అంతేకాకుండా కేవ‌లం జూన్ నెల‌లోనే భార‌త్లో దాదాపు 4ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే, భార‌త్‌లో మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, దిల్లీల‌లో వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న ఒక్క‌రోజే మ‌హారాష్ట్రలో 6555పాజిటివ్ కేసులు న‌మోదుకాగా త‌మిళ‌నాడులో 4,150కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌హారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2,06,619గా న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 8,822 మంది మృత్యువాత‌ప‌డ్డారు. త‌మిళ‌నాడులో కొవిడ్ కేసుల సంఖ్య 1,11,151కి చేర‌గా 1510 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజ‌ధాని దిల్లీలో కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేర‌వ‌య్యింది. సోమ‌వారం ఉద‌యానికి దిల్లీలో 99,444 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ కాగా మృతుల సంఖ్య 3067గా న‌మోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని